ఆఫ్రికాలో వరద విలయం … 100 మంది మృతి
ఆఫ్రికా దక్షిణ ప్రాంతాన్ని కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాల్లో ప్రకృతి ప్రకోపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ వరద విపత్తుల్లో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి .లక్షలాది మంది తమ నివాసాలు కోల్పోయి నిరాశ్రయులుగా మారారు. వందలాది కుటుంబాలు ఆకలి, అనారోగ్య భయాలతో ఎదురుచూస్తున్నాయి . రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజల్లో ఆందోళనలు మరింత పెరిగింది. మొజాంబిక్‌లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో దాదాపు రెండు లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలాది ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి. పంట పొలాలు కొట్టుకుపోవడంతో ఆహార కొరత భయం వెంటాడుతోంది. తాగునీటి వనరులు కలుషితమవడంతో కలరా, డయేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదముందని ఆరోగ్య శాఖలు అప్రమత్తం చేస్తున్నాయి. అత్యవసర సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి ఆహారం, తాగునీరు, ఔషధాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
మరోవైపు, జింబాబ్వేలో ఈ వరదలు 70 మంది ప్రాణాలను బలిగొన్నాయి. వరద ఉధృతికి వెయ్యికి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సహాయక బృందాలు చేరలేని ప్రాంతాల్లో ప్రజలు ఆహారం, నీరు లేక నానా అవస్థలు పడుతున్నారు.
వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. క్రుగర్ నేషనల్ పార్క్‌లో చిక్కుకున్న సుమారు 600 మంది పర్యాటకులు, సిబ్బందిని హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల కారణంగా విద్యుత్ సరఫరా, రవాణా వ్యవస్థలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి.
అమెరికా వాతావరణ హెచ్చరికల సంస్థ ప్రకారం, లా నినా ప్రభావమే ఈ అసాధారణ వర్షాలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం ఇంకా కొనసాగవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు సహాయానికి ముందుకొచ్చాయి. దక్షిణ ఆఫ్రికా దేశాలు ఎదుర్కొంటున్న ఈ మహా సంక్షోభంలో ప్రాణ రక్షణే అత్యవసర కర్తవ్యంగా మారింది.

