ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల వరద
అందాల విశాఖనగరంలో ప్రతిష్టాత్మక ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సదస్సులో వివిధ కంపెనీలు ఆంధ్రలో పెట్టుబడులు పెట్టడానికి పోటీలు పడుతున్నాయి. ప్రపంచ కుబేరులుగా పేరుపొందిన అదానీ, అంబానీలు సిమెంట్ ఫాక్టరీలు, డేటా సెంటర్లు, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పబోతున్నామని ప్రకటించారు. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సీఈఓ గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ ఏపీలో రెండు సిమెంటు ఫాక్టరీలు ఏర్పాటు చేస్తామన్నారు.

వీటిని కడప, నడికుడిలో 10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థంతో నెలకొల్పుతామన్నారు. అంతేకాక అదానీ కంపెనీ తరపున విశాఖ 400 మెగావాట్స్ డేటా సెంటర్‌ను, 100 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఇప్పటికే నిర్వహిస్తున్న కృష్ణపట్నం, గంగవరం పోర్టుల సామర్థ్యాన్ని రెట్టింపు చేయబోతున్నామని, వీటిని ఇండస్ట్రియల్ పోర్ట్ సిటీస్‌గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఏపీలో వివిధ నగరాలలో పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కూడా ఏపీపై ప్రాజెక్టుల వర్షం కురిపించారు.

ఇప్పటికే ఏపీలో కేజీ డి-6 బేసిన్‌లో పెట్టిన 1.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు తోడు 10 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బేసిన్‌లో 30 శాతం మేర దేశీయ అవసరాలను తీరుస్తోందని చెప్పారు. ఈ సంవత్సరం చివరినాటికి దేశవ్యాప్తంగా జియోట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.


 
							 
							