Home Page SliderNewsTelangana

శంషాబాద్‌లో దిగాల్సిన విమానాలు గన్నవరంలో ల్యాండ్!

విజయవాడ: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీనివల్ల రన్‌వేపై విజిబిలిటీ కనిష్ట స్థాయికి పడిపోవడంతో విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా విమానయాన అధికారులు రెండు ఇండిగో విమానాలను విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు.

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు, అలాగే ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన రెండు ఇండిగో విమానాలు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అయితే అక్కడ ల్యాండింగ్‌కు వాతావరణం సహకరించకపోవడం, విమానాలు గాలిలో ఎక్కుసేపు వేచి ఉండటం సురక్షితం కాదని భావించిన పైలట్లు, అధికారుల సూచన మేరకు వాటిని సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి దారి మళ్లించారు.శుక్రవారం ఉదయం ఈ రెండు విమానాలు గన్నవరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి.

ఈ రెండు విమానాల్లో కలిపి సుమారు 360 నుంచి 400 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానాలు విజయవాడలో ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురైనప్పటికీ, అధికారులు పరిస్థితిని వివరించడంతో ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌లో వాతావరణం మెరుగుపడి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి అనుమతి వచ్చే వరకు ప్రయాణికులు విమానాశ్రయంలోనే వేచి చూడాల్సి వచ్చింది. విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికులకు అవసరమైన అల్పాహారం, తాగునీరు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

ఉదయం 10 గంటల తర్వాత హైదరాబాద్‌లో పొగమంచు తగ్గుముఖం పట్టడంతో వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంది. క్లియరెన్స్ లభించిన వెంటనే ఈ రెండు విమానాలు గన్నవరం నుండి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరినట్లు విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. కాగా, కేవలం ఈ రెండు విమానాలే కాకుండా హైదరాబాద్ విమానాశ్రయంలో సుమారు 19 విమానాలు రద్దు కావడం, మరికొన్ని ఆలస్యంగా నడవడం వల్ల వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.