కరోనాతో ఐదేళ్లు వెనక్కి..!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భారీగా కుదిపేసింది. కొవిడ్ సృష్టించిన బీభత్సం అంతా.. ఇంతా కాదు. ఎక్కడో చైనాలో పుట్టిన వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి పేదల పాలిట శాపంగా మారింది. రెండేళ్ల పాటు ప్రజలను పీడించిన ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. నెలల తరబడి లాక్‌డౌన్ విధించడంతో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. అంతేకాదు.. కరోనా అనంతర ఆరోగ్య సమస్యలతో ఇప్పటికీ లక్షలాది మంది నరక యాతన పడుతున్నారు. ఈ వలయంతో వణికిపోయిన ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి.

71.4 ఏళ్లకు పడిపోయిన ఆయురార్ధం
ఓ వైపు వైద్యానికి లక్షలాది రూపాయలు.. మరోవైపు ఉద్యోగం కోల్పోయి ఆదాయం లేకపోవడంతో ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) నిర్వహించిన సర్వేలో కరోనా వల్ల ప్రపంచ మానవాళి ఐదేళ్లు వెనక్కి వెళ్లింది. ఆ సర్వే నివేదిక ప్రకారం.. కొవిడ్ దెబ్బకు ప్రపంచ మానవాళి అభివృద్ధి సూచి వరుసగా రెండేళ్లు (2020, 2021లో) తిరోగమనం దిశగా పయనించింది. అంతేకాదు.. ప్రజల ఆయురార్ధం, విద్యా స్థాయులు, జీవన ప్రమాణాలు భారీగా పడిపోయాయి. 2019లో 73 ఏళ్లుగా ఉన్న ప్రపంచ ప్రజల ఆయురార్ధం 2021 నాటికి 71.4 ఏళ్లకు పడిపోయింది. గత 30 ఏళ్లలో ఆయురార్ధం ఇంతగా క్షీణించడం ఇదే తొలిసారి. ప్రపంచంలో ఇది అతిపెద్ద విపత్తుగా నిలిచిపోయింది.

చితికిపోయిన ప్రపంచ దేశాలు..
పేద దేశాలు మరింతగా చితికి పోయాయి. ప్రపంచంలో 90 శాతం దేశాలు ఈ విపత్తు నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కొన్ని దేశాలైతే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. మూలిగే నక్కపై రోకలి బండ పడ్డట్లు.. ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన, ఆహార సంక్షోభం పెరిగిపోయింది. శ్రీలంక వంటి దేశాల్లో ప్రజలకు ఆహారం కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వాలపై ప్రజా తిరుగుబాట్లు జరిగాయి. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, దక్షిణాసియా, కరేబియన్ ప్రాంతాల్లోని నిరుపేద దేశాల్లో ఇప్పటికీ ఆకలి చావులు కొనసాగుతున్నాయి.