హైదరాబాద్ అభివృద్ధికి ఐదేళ్ల యాక్షన్ ప్లాన్
హైదరాబాద్ నగర ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ను ప్రక్షాళన చేయాలని ఆయన నిర్ణయించారు . కొత్తగా నియమితులైన 12 మంది జోనల్ కమిషనర్లతో మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలనలో గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు మారాలని, వచ్చే ఐదేళ్ల కోసం పక్కా యాక్షన్ ప్లాన్‌తో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్విభజించిన నేపథ్యంలో, జోనల్ కమిషనర్లు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా నగరంలో చెత్త నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, నెలకు మూడు రోజుల పాటు పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు, ఆటోలను ప్రోత్సహించాలని తెలిపారు. చెరువులు, నాలాల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించాలని, జనవరి నుంచే నాలాల పూడికతీత పనులు ప్రారంభించాలని హైడ్రా, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

