ఈ బెంగాల్ జాలరి వలలో రూ. కోటి విలువైన చేపలు
పశ్చిమ బెంగాల్ లోని ఈ జాలరికి లక్కు మామూలుగా లేదు. ఒక్క రోజులోనే రూ.ఒక కోటి విలువైన చేపలు వలలో పడి, అతని జీవితాన్నే మార్చేశాయి. రోజుల తరబడి సముద్రంలో కష్టపడినా వారికి ఒక్కోసారి పాపం కనీస అవసరాలు తీరే సొమ్ము కూడా దక్కదు. కానీ కొన్ని అరుదైన చేపలు వారి వలలో పడితే అదృష్టం పండినట్లే. అలాంటి లక్కీ మత్స్యకారుడు ఒడిశా- పశ్చిమ బెంగాల్ సరిహద్దు వెంబడి దిఘా సమీపంలోని బంగాళాఖాతంలో చేపలు పట్టుకున్నాడు. ఈ క్రమంలో అరుదైన భారీ తెలియా భోలా అనే జాతికి చెందిన 90 చేపలు అతనికి చిక్కాయి. ఈ చేపలను వేలం వేయగా అతనికి దాదాపు కోటి రూపాయలు లభించింది. ఈ చేపలు ఒక్కొక్కటి 35 కిలోల వరకూ బరువు ఉంటుంది. వీటిలో ఉండే అధిక ఔషధ, వాణిజ్య విలువల కారణంగా కోల్ కతాకు చెందిన ఒక ఫార్మాస్యూటికల్ సంస్థ కోటి రూపాయల ధర ఇచ్చి ఈ 90 చేపలను దక్కించుకుంది. తేలియా భోలా చేపనూనెను ప్రాణాంతమైన వ్యాధులకు తయారు చేసే మందులలో ఉపయోగిస్తారు. అంతేకాదు ఈ జాతి చేపలను విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తారు. ఈ చేపలు సాధారణంగా లోతైన సముద్ర ప్రాంతాలలో ఉంటాయని చెప్తున్నారు. చేప బరువు, సైజు, అది ఆడదా..మగదా అనే దానిని బట్టి కూడా దాని ధర నిర్ణయించబడుతుందట. ఈ చేపలను చూడడానికి స్థానికులు, పర్యాటకులు దిఘా చేపల మార్కెట్ కు పోటెత్తారు.