గాజా శాంతి ఒప్పందంలో ‘తొలి దశ’
మధ్యప్రాచ్యంలో శాంతి సాధన కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక చర్యలు ఫలితాన్నిస్తుండగా, గాజా అంశంపై ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలోని తొలి దశకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయని ఆయన ప్రకటించారు. ఈ ఒప్పందం ద్వారా రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న రక్తపాతానికి ఒక ముగింపు దిశగా ముందడుగు పడిందని ట్రంప్ తెలిపారు.
ఇదిలాఉండగా . 2023 అక్టోబర్ 7న హమాస్ దక్షిణ ఇజ్రాయెల్‌పై చేసిన దాడిలో 1,200 మంది మరణించగా, 251 మందిని బందీలుగా తీసుకెళ్లిన తరువాత ఈ ఒప్పందం జరిగింది. దీని ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడుల్లో గాజాలో 67,000 మందికిపైగా మరణించారని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ పరిస్థితుల్లో ఈజిప్ట్‌లో ముగిసిన మూడు రోజుల పరోక్ష చర్చల తర్వాత, ట్రంప్ సోషల్ మీడియాలో తొలి దశ ఒప్పందాన్ని వెల్లడించారు. “ఇది శాశ్వత శాంతి దిశగా వేసిన మొదటి అడుగు. బందీలు త్వరలో విడుదలకాబోతున్నారు. ఇజ్రాయెల్, అంగీకరించిన హద్దుల వరకూ తన దళాలను ఉపసంహరించుకుంటుంది” అని ట్రంప్ ‘ట్రూత్ లో సోషల్’లో పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ఒప్పందాన్ని “ఇజ్రాయెల్‌కి మహత్తరమైన రోజు”గా అభివర్ణించారు. గురువారం తన ప్రభుత్వం దీనిపై ఓటింగ్ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇజ్రాయెల్ ఇప్పటికీ 48 మంది బందీలు గాజాలో ఉన్నారని చెబుతోంది, వారిలో సుమారు 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నారని భావిస్తున్నారు.