రేపు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా?
భారతీయ జనతా పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను రేపు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో ప్రముఖంగా బీసీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున సీట్లను కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో రెడ్డి, వెలమ, ఎస్సీ, ఎస్టీ, తదితర వివిధ వర్గాలకు చెందిన నేతలు ఉంటారు. బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, వివేక్, విజయశాంతి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. వారితోపాటుగా దుబ్బాక ఎమ్మెల్యే మాధవరం రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జాబితాలో ప్రముఖంగా ఉన్నారు. వారితోపాటుగా మహేశ్వర్ రెడ్డి, రమేశ్ రాథోడ్ , ఎర్రబెల్లి ప్రదీప్ రావు, సహా పలువురు ప్రముఖ నేతలు తమ తమ నియోజకవర్గాల నుంచి టికెట్లు పొందే అవకాశం ఉంది.

గద్వాల్ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ, మహబూబ్‌నగర్ నుంచి మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, నిర్మల్ నుంచి మాజీ ఎమ్మెల్యే అల్లెటి మహేశ్వర్‌రెడ్డి, ఖానాపూర్ నుంచి రమేశ్ రాథోడ్, వరంగల్ తూర్పు నుంచి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, దుబ్బాక నుంచి ఎం. రఘునందన్‌రావు, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ బరిలో దిగనున్నారు. కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నిజామాబాద్ ఎంపీ డి అరవింద్ ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలను కొట్టిపారేయడం లేదని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అలాగే చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ జి.వివేక్‌కు పార్టీ సూచించింది. కొంతమంది సీనియర్ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు కానీ తెలంగాణలో బీజేపీకి సీరియస్ కాదనే తప్పుడు సందేశాన్ని ప్రజలకు ఇవ్వకుండా ఎన్నికల బరిలోకి దిగాలని పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశించింది. ఇలాంటి తప్పుడు అభిప్రాయం 2024లో పార్టీ ప్రయోజనాలకు హానికలిగిస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాషాయ పార్టీ మూడు జాబితాల్లో 119 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.