Home Page SliderNational

ఇకపై ఆరేళ్ల తర్వాతే మొదటి తరగతి

పసిపిల్లలను ఆరేళ్లలోపే మొదటి తరగతిలో చేర్పించే విధానానికి స్వస్తి పలకాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసింది. కేంద్రప్రభుత్వ ప్రతిపాదనలను అనుసరించి, నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఆరేళ్లు నిండిన పిల్లలనే స్కూల్‌లో చేర్పించాలని డిమాండ్ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఈ విధానమే వర్తించనుంది. మొదటి ఐదు సంవత్సరాల బాల్యాన్ని ఆడుతూ పాడుతూ కొత్తవిషయాలు, జనరల్ నాలెడ్జ్ తెలుసుకునే విధంగా పిల్లలు గడపాలని నిర్దేశించింది. దీనికోసం అంగన్ వాడీలు, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ సంస్థలు నిర్వహించే ప్రీ స్కూల్ కేంద్రాలలో పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవాలని సూచించింది. దీనికి అనుగుణంగా ప్రవేశ ప్రక్రియలలో మార్పులు తేవాల్సి ఉంటుంది.

ప్రీస్కూల్ చిన్నారులకు తగిన విధంగా బోధించే ఉపాధ్యాయులకు తగిన శిక్షణతో ఖచ్చితంగా రెండేళ్ల డిప్లమో కోర్స్ రూపొందించాలని, దానిని అమలు చేయాలని సూచించింది. ఈ కోర్సును స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT)ద్వారా రూపొందించాలి. దీనిని జిల్లాల వారీగా (DIET) ద్వారా అమల్లో పెట్టాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. మనిషి మెదడు పెరుగుదలలో అత్యంత కీలకమైన మొదటి ఆరు సంవత్సరాల కాలాన్ని గంటల కొద్దీ పాఠశాలల్లో గడిపి, బట్టీ పద్దతులలో చదువు నేర్చుకునే పద్దతి మంచిది కాదంది. పునాది దశలో వారికి ఆటపాటలతో సరదాగా విద్యను బోధించవలసి ఉంటుందని… అప్పుడే వారి మానసిక పెరుగుదల బాగుంటుందంది. అందుకే ప్రీస్కూల్ నుండి కనీసం రెండో తరగతి వరకూ ఈ అభ్యాస విధానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది.