నిర్మలాసీతారామన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు
సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ బెంగళూరు చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల బాండ్ల పేరుతో పలువురు పారిశ్రామికవేత్తలను ఆర్థికమంత్రి బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని జనాధికార సంఘర్ష పరిషత్తుకు చెందిన ఆదర్శ్ అయ్యర్ అనే వ్యక్తి తిలక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయడానికి ప్రయత్నించారు. అయితే వారు కేసు నమోదు చేయడానికి అంగీకరించలేదు. దీనితో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసుపై విచారించిన న్యాయమూర్తి పోలీసులకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేయనున్నారు.