TSPSC కేసులో ఛార్జిషీట్ దాఖలు- వెల్లడైన లావాదేవీలు
TSPSC ప్రశ్నాపత్రం లీకేజి కేసులో నేడు సిట్ (SIT) నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీనిలో ఇప్పటివరకూ 1.63 కోట్ల రూపాయలు చేతులు మారాయని, లావాదేవీలు జరిగాయని, ఈ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 49 మందిని అరెస్టు చేశామని, వారిలో 16 మంది బ్రోకర్లని గుర్తించారు. నిందితుల ఖాతాల వివరాలు, చేతులు మారిన నగదు వివరాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్లు నలుగురికి చేరాయి. వారిలో ముగ్గురు TSPSCలో పనిచేసే ఉద్యోగులు కాగా, మరొకరు బయటివ్యక్తి. అరెస్టయిన డీఈ రమేష్ ఇచ్చిన సమాచారంతో ఏఈఈ, డీఏవో పరీక్షలలో కాపీయింగ్‌కు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుండి మొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ లాబ్‌కు పంపారు. వాటి ఆధారాలను బట్టి ఈ కేసులో ఇంకా అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశముందని, కేసులో పూర్తి వివరాలు లభ్యమయిన అనంతరం అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేస్తామన్నారు సిట్ అధికారులు.

