పోరుకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
- ఏపీలో పూర్తిగా వేడెక్కిన రాజకీయం
- అధికార పక్షాన్ని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఎత్తులు, పొత్తులు
- ఎన్నికలకు ఏడాది ముందే సిద్ధమవుతున్న పార్టీలు
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరగటానికి మరో ఏడాది ఉన్నప్పటికీ గెలుపే ధ్యేయంగా అధికార, ప్రతిపక్షాలు ఎవరికి వారు ఎత్తులు కు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు తమ జోరును పెంచి పోరుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. ఒకవైపు అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎత్తులు పొత్తులతో ముందుకు సాగుతుంటే దానికి దీటైన జవాబు ఇచ్చేందుకు అధికారపక్షం సన్నాహాలు మొదలుపెట్టింది. అధికార పక్షం రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని ప్రకటిస్తుండగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం 175 స్థానాల్లో వారిని ఓడిస్తామని సవాళ్లు విసురుతోంది.

ఇదే సమయంలో ఇరు పార్టీల అధినేతలు మైండ్ గేమ్ కు తెరతీయటంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయాలను సొంతం చేసుకున్న తెలుగుదేశం పార్టీ మరింత తన దూకుడును పెంచి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.పొత్తులు లేకుండా 175 స్థానాల్లో ఎన్నికల బరిలోకి దిగాలని తెలుగుదేశం పార్టీ నేతలకు అధికారపక్షం సవాళ్లు విసురుతోంది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం అధికార పార్టీని ఓడించడమే తమ లక్ష్యమని అన్ని పక్షాలను కలుపుకొని ఎన్నికల బరిలోకి దిగి వైయస్సార్సీపీని గద్దే దించడమే తమ లక్ష్యమని అంటున్నారు. దీంతో పొత్తుల ఖాయంగా కనిపిస్తున్నాయి.

జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీకి అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఇప్పటికే భారీ ప్రచారం జరుగుతోంది. ఇదే బాటలో వామపక్షాలు కూడా పయనిస్తున్నాయి. ఇక కేంద్రంలో చక్రం తిప్పుతున్న భారతీయ జనతా పార్టీ మాత్రం రెండు పడవలపై కాలు వేసి నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ రాజకీయంగా చర్చకు దారితీసాయి. అధికార పార్టీ నుండి 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఇప్పటికే ఏపీలో ఎన్నికల వాతావరణం మొదలవడంతో తెలుగుదేశం పార్టీ రోజుకు ఒక జిల్లాలో వివిధ కార్యక్రమాల ద్వారా అధికార పార్టీ అవినీతికి పాల్పడుతుందంటూ ఆరోపణలు చేస్తూ రాజకీయ దాడిని పెంచింది.

యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న లోకేష్ కూడా ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యేల పనితీరు అవినీతిని ఎండగడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యలను అధికార పార్టీ కూడా తిప్పికొట్టేందుకు వారిపై ముప్పేట దాడికి దిగుతున్నారు. ఇక జనసేన అధినేత గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉండి భారతీయ జనతా పార్టీ పెద్దలతో పొత్తు వ్యవహారాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్సీపీ ఓటమి లక్ష్యంగా పనిచేస్తామని వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఢిల్లీలో మంగళవారం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ రానున్న ఎన్నికలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ముందుకు వెళ్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి రానున్న ఎన్నికల్లో పార్టీల పొత్తులు ఏ విధంగా ఉంటాయో ప్రజలు ఏ పార్టీని ఆశీర్వదిస్తారో వేచి చూడాల్సి ఉంది.