Home Page SliderTelangana

వారసత్వపు కాబోయే ఎమ్మెల్యేలు కొందరే..

వారసులపై పార్టీలు ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. ఇప్పటివరకు గ్రేటర్‌లో రెండు నియోజకవర్గాల్లో తప్ప పెద్దగా టిక్కెట్లు ఎవరికీ దక్కలేదు. ఇప్పటికీ కొంతమంది తమకు టిక్కెట్ వస్తుందనే ఎదురుచూస్తూ ఉన్నారు.

గతంలో బరిలో దిగిన నేతల తనయులు చాలామంది.. ఈసారి ఎన్నికల క్షేత్రంలో లేకపోవడంపై చర్చనీయాంశమైంది. మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు ఓటమి పాలుకావడం, పార్టీల సమీకరణలు, ఇతరత్రా కారణాలతో ఆయా వ్యక్తులకు సర్దుబాటు చేయలేకపోయారని పార్టీవర్గాలు అంటున్నాయి.

బరిలో ముగ్గురు—కంటోన్మెంట్ నుండి బీఆర్ఎస్ తరఫున లాస్య నందిత పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న మృతితో, ఆయన కుమార్తె అయిన ఆమెకు అవకాశం దొరికింది. గతంలో ఆమె కవాడిగూడ కార్పొరేటర్‌గా ఒకసారి గెలిచి, మరోసారి ఓడిపోయారు.

మల్కాజిగిరి నుండి బీఆర్ఎస్ తరఫున మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అనూహ్యంగా బరిలోకి వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనకు అవకాశం దక్కింది. 2019లో మల్కాజిగిరి పార్లమెంట్‌కు పోటీచేసి పరాజయం చవిచూశారు.

చివరి వరకు ప్రయత్నం: పీజేఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెల్చిన విష్ణువర్ధన్‌రెడ్డి జూబ్లీహిల్స్ టిక్కెట్ ఆశించినా అక్కడ మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు అభ్యర్థిత్వం దక్కింది.

బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుత గవర్నర్ అయిన బండారు దత్తాత్రేయ తనయ విజయలక్ష్మి ముషీరాబాద్ అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నారు.

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రం గౌడ్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గోషామహల్ నుండి పోటీచేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరారు. గోషామహల్‌ బీజేపీ సీట్ రాజాసింగ్‌కు దక్కింది.

తాజాగా పి.జనార్ధన్‌రెడ్డి తనయ పి.విజయారెడ్డికి ఖైరతాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం లభించింది.

పోటీకి దూరంగా మరికొందరు.. ముషీరాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసినా విజయం చేకూరలేదు. ఈసారి అధిష్ఠానం టిక్కెట్‌ను అంజన్ కుమార్ యాదవ్‌కు కేటాయించింది.

నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్‌పల్లి నుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు పి.కార్తీక్‌రెడ్డి 2014లో చేవెళ్ల నుండి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. 2019 లో కాంగ్రెస్ నుండి సబితా ఇంద్రారెడ్డి గెల్చి బీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం కార్తీక్‌రెడ్డికి రెండోసారి పోటీచేసే అవకాశం దక్కలేదు.