జాతీయ రహదారిపై అఘోరీ హంగమా
మంగళగిరి వద్ద జాతీయ రహదారిపై మహిళా అఘోరీ నానా హంగమా చేసింది. జనసేన పార్టీ ఆఫీస్ సమీపంలో హైవే పై బైఠాయించింది. పవన్ కల్యాణ్ ను కలిసిన తర్వాతనే ఇక్కడ నుంచి వెళతానంటూ డిమాండ్ చేస్తూ రోడ్డుపైనే కూర్చుని నిరసన తెలిపింది. ఆలయ భూములను పరిరక్షించాలని పవన్ ను కోరుతానని చెప్పింది. సనాత్మక ధర్మం కోసం పోరాడే పవన్ ను కలిసి హిందువుల పై జరుగుతున్న దాడులు, దేవాలయల కూల్చివేత, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడతానని పేర్కొంది. అఘోరీ నిరసనతో గుంటూరు-విజయవాడ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వీడియో తీస్తున్న ఓ రిపోర్టర్ పై కర్రతో దాడి చేసి అతడిని గాయపరిచింది. అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించిన పోలీసులపైనా దాడికి యత్నించింది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అతి కష్టం మీద పోలీసులు ఆమెను విజయవాడ వైపు తీసుకెళ్లారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.