అవమాన భారంతో మహిళా కార్యకర్త ఆత్మహత్య..
అవమాన భారంతో టీడీపీ మహిళా కార్యకర్త ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం విభరింతలపాడు గ్రామంలో జరిగింది. కమ్మ పుట్టుక పుట్టిన నన్ను ఒసేయ్ అంటూ అందరి ముందు అవమానిస్తాడా అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆపై పురుగుల మందు తాగి టీడీపీ కార్యకర్త మాధురి చనువు చాలించింది. తన చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే సౌమ్యను కోరింది. విభరింతల పాడు గ్రామానికి చెందిన అబ్బూరి మాధురి (35) గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లగా.. పని ప్రదేశంలో ఫీల్డ్ అసిస్టెంట్ మైలా రవితేజ తనను తిట్టారని మాధురి ఆరోపించింది. ఆ అవమాన భారంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

