తోడికోడళ్ల హత్యకేసులో మామ- భర్తలే కాలయముళ్లు
ఇద్దరు తోడికోడళ్ల జంటహత్యలు ఓర్వకల్లు మండలం నన్నూరులో కలకలం సృష్టించాయి. పిల్లలు ఇంకా పుట్టలేదనే చిన్న కారణంతో ఇద్దరు మహిళల ప్రాణాలను అన్యాయంగా పొట్టన పెట్టుకుంది ఆ కుటుంబం. కర్నూలు జిల్లా నన్నూరుకు చెందిన కురువ గోగన్న, మంగమ్మ దంపతుల కుమారులతో రామేశ్వరి, రేణుకలకు పెళ్లిళ్లు జరిగాయి. వారిద్దరికీ పెళ్లి జరిగి ఐదేళ్లు కావస్తున్నా ఇంకా పిల్లలు కలుగలేదు. వారి కుటుంబానికి 30 ఎకరాలు భూమి ఉంది. ఆ భూమి విలువ కోట్ల రూపాయలలో ఉండడంతో వారసుల కోసం కోడళ్లను చంపేసి , కొడుకులకు మళ్లీ పెళ్లి చేయాలనే పథకం వేశాడు మామ గోగన్న. దీనితో తన ఇద్దరు కుమారులు పెద్ద రామగోవిందు, చిన్న రామగోవిందులతో కలిసి పన్నాగం పన్ని వారిని హతమార్చినట్లు పోలీసు విచారణలో అంగీకరించారని సమాచారం. హత్య చేసి పారిపోయే సమయంలో చిన్న రామగోవిందు కాలిచెప్పు ఘటనా స్థలంలో దొరికింది. దీనితో పోలీసులు తండ్రి, కొడుకులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. హత్యజరిగిన మహిళల కుటుంబ సభ్యులు, బంధువులు నిందితుల ఇంటిని చుట్టుముట్టి మృతదేహాలను అక్కడే పూడ్చాలని పట్టు పట్టారు. చివరకు పోలీసుల జోక్యంతో నిందితుల పొలంలో అంత్యక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం.

