జగన్ చేతిలో ఎమ్మెల్యేల భవితవ్యం
• నేడు పార్టీ ఎమ్మెల్యేలతో చివరి వర్క్ షాప్
• గడపగడపకు ఎమ్మెల్యేల పనితీరుపై క్లారిటీ
• తాజా నివేదికలు వెల్లడించనున్న జగన్
• ఎమ్మెల్యేలలో మొదలైన ఉత్కంఠ
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతి వ్యూహాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగానే పార్టీ నేతలు అంతా ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు పరుస్తున్నారు. ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో ప్రతి ఇంటికి పార్టీ నేతలు వెళ్లేలా చేశారు. ఇందులో వెనకబడి ఉన్న నేతలకు క్లాస్ తీసుకుంటూ దిశా నిర్దేశం చేసి హెచ్చరికలు జారీ చేస్తూ వారి పని తీరు మెరుగుపరుచుకోవాలని అవకాశాలు కూడా ఇచ్చారు. సీఎం హెచ్చరికలతో ఈ కార్యక్రమంలో వెనుకబడిన నేతలంతా ఇప్పుడు గడపగడపకు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.

అయితే సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. అందులో ఎమ్మెల్యేల పనితీరు గడపగడపకు ప్రభుత్వ నిర్వహణపై తాజా నివేదికలను వెల్లడించే అవకాశం ఉంది. ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తారని స్పష్టం చేసిన సీఎం జగన్ తాజాగా అందిన నివేదికల ఆధారంగా నేడు జరిగే సమావేశంలో ఎమ్మెల్యేలకు ఏమి చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ భేటీలోనే ఎమ్మెల్యేలకు కొత్త బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఇదిలా ఉండగా గత సమావేశంలోనే ముఖ్యమంత్రి గృహసారధుల నియామకం గురించి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలోనూ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ విధించిన గడువు దాదాపుగా ముగిసింది. నేడు జరిగే సమావేశంలో ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టుతో పాటుగా కొత్త కార్యక్రమాల పైన సీఎం జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.

గత సమావేశంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ముఖ్యమంత్రి సర్వే వివరాలను వెల్లడించారు. ప్రజల్లో గ్రాఫ్ పెరగకపోతే సీట్లు ఇవ్వడం కష్టమని ఆ సమావేశంలో తేల్చి చెప్పారు. పని తీరు మెరుగుపరచుకోవటానికి వారికి మరో అవకాశం కూడా ఇచ్చారు. దీంతో ఈరోజు జరిగే సమావేశంలో సీఎం ఏం చెప్పబోతున్నారనేది ఆ ఎమ్మెల్యేలలో ఉత్కంఠ పెంచుతుంది. దీంతోపాటు జగనన్నే మా భవిష్యత్తు ప్రచార కార్యక్రమం పై కూడా ఎమ్మెల్యేలకు పలు సూచనలు జగన్ చేయనున్నారు. ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం పైన వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం చేపట్టనున్నారు 20వ తేదీన 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏకకాలంలో జగనన్నే మా భవిష్యత్తు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ ప్రచార కార్యక్రమాన్ని నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో 100% పూర్తి చేయాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించిన విషయం విధితమే.

వచ్చే ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన అందులో వెనుకబడిన ఎమ్మెల్యేల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడటం లేదు. రెండోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించి అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్ 175 సీట్లు గెలుచుకోవటమే టార్గెట్గా పెట్టుకొని ఎమ్మెల్యేలను సైతం సమాయత్తం చేశారు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరిస్థితి, మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ ఎక్కడ బలహీనపడుతుంది, అక్కడ తీసుకోవాల్సిన చర్యలు, నియోజకవర్గాల్లో కుమ్ములాటలు, కీచులాటలు వంటి వాటిపై చర్యలు కూడా ప్రారంభించారు. అందుకు తగినట్టుగానే నియోజకవర్గాల వారీగా నివేదికలు తెప్పించుకుంటున్నారు.

తాజాగా జగన్ చేతికి నివేదికలు అందాయి. వాటిపై ఈరోజు జరిగే సమావేశంలో జగన్ చర్చించనున్నారు. దీంతోపాటు ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎంతవరకు బలపడింది బలపడటానికి కారణాలు ఏమిటి? ఆ పార్టీలో ఉన్న గ్రూపుల పరిస్థితి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేను నియోజకవర్గంలో కొనసాగించాలా మార్చాలంటే అందుకు కారణాలు సచివాలయాల పనితీరు వాలంటీర్లు ఎలా పని చేస్తున్నారు గడపగడపకు మన ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారా అసలు ఈ కార్యక్రమం గురించి ప్రజలేమనుకుంటున్నారు. వీరంతా ప్రజలతో కలుస్తున్నారా ప్రభుత్వము యొక్క ఉద్దేశం నెరవేరుతుందా ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయం ఏమిటి? తదితరాంశాలపై కూడా అధ్యయనం చేపించిన జగన్ ఆ నివేదికల ఆధారంగా నేడు జరిగే సమావేశంలో ఎలాంటి సంచాలన నిర్ణయాలు ప్రకటిస్తారో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రజలతో మమేకం కాలేని ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైందని ఇప్పటికే ఎమ్మెల్యేలంతా అమరావతికి చేరుకున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

