విధి బలీయమైంది.. గంట గేప్‌లో బ్రదర్స్ మృతి
విధి వంచించడంతో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు గంట వ్యవధిలో తనువు చాలించారు. స్వగ్రామంలో కరెంట్ షాక్‌తో అన్న చనిపోగా, విషయం తెలుసుకొన్న తమ్ముడు హైదరాబాద్ నుంచి టూవీలర్‌పై వస్తూ ఉండగా మార్గమధ్యలో యాక్సిడెంట్‌కు గురై మృతి.
మైదుకూరు: విధి వంచించడంతో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు గంట వ్యవధిలో అసువులు బాసారు. స్వగ్రామంలో కరెంట్ షాక్‌తో అన్న చనిపోగా, ఆ విషయం తెలిసిన తమ్ముడు హైదరాబాద్ నుండి టూ వీలర్‌పై వస్తూ మార్గమధ్యలో ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన వైఎస్ఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల వివరాల మేరకు.. మైదుకూరు మండలం గంజికుంట గ్రామానికి చెందిన పాములేటి రాజా, నాగలక్షుమ్మ దంపతులకు పాములేటి నరేంద్రకుమార్ (29), రాజేష్ (25), ఒక కుమార్తె సంతానం. నరేంద్ర తల్లిదండ్రుల వద్ద ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. రాజేష్ హైదరాబాద్‌లోని బాలానగర్‌లో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
నరేంద్ర ఎప్పటిలాగే గురువారం ఉదయం తల్లిదండ్రులతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ పంపుసెట్టుకు స్టార్టర్ బిగించే క్రమంలో ఉ.11 గంటలకు కరెంట్ షాక్ గురయ్యాడు. వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న రాజేష్ వెంటనే హైదరాబాద్ నుండి టూవీలర్‌పై వస్తున్నాడు. మార్గమధ్యలో శంషాబాద్ వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అసలే పెద్దకుమారుడిని కోల్పోయిన బాధలో ఉన్న ఆ తల్లిదండ్రులకు రాజేష్ విషయం తెలియడంతో గుండెపగిలేలా ఏడ్చారు. ఒకేరోజు ఇద్దరు కుమారులు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దాంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.