NationalNews

మరోసారి రైతుల నిరసన.. రాజ్‌భవన్‌ల ముట్టడికి పిలుపు

ఢిల్లీ సరిహద్దుల్లో సాగు చట్టాలను రద్దు చేసేవరకు నెలల తరబడి నిరసన తెలిపిన రైతులు మరోసారి గళమెత్తనున్నారు. సాగు చట్టాల రద్దు టైంలో తమ డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేంద్రం మాట తప్పిందని రైతు సంఘం కిసాన్‌ మోర్చ ఆరోపించింది. అలాగే “కర్జ్‌ ముక్తి – పూరా దామ్‌” (రుణ భారం నుండి స్వేచ్ఛ- పూర్తి గిట్టుబాటు ధర)తో సహా అన్ని డిమాండ్లను ప్రభుత్వం అమలు చేసేవరకు దేశవ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తామని రైతు సంఘం తెలిపింది.  ఈ నేపథ్యంలో ఈనెల 26న దేశవ్యాప్తంగా ఉన్న రాజ్‌భవన్‌లను ముట్టడిస్తామని ప్రకటించింది. డిసెంబర్‌ 1-11 మధ్య ఎంపీల కార్యాలయాలను రైతులు ముట్టడిస్తామన్నారు.

భారత దేశంలో 1995 నుండి 4 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 68% రైతు కుటుంబాలు అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. కార్పొరేషన్లకు అనుకూలంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాల రద్దు, విద్యుత్‌ బిల్లు 2020తోపాటు ఈ డిమాండ్లు 2020 నవంబర్‌ 26న ఢిల్లీ సరిహద్దుల వద్ద ఒక సంవత్సరం పాటు చారిత్రాత్మక రైతుల ఆందోళనకు దారి తీశాయి. దీనికి దాదాపు అన్ని వర్గాల భారతీయ కార్మికుల నుండి చురుకైన మద్దతు లభించింది.