తాగుబోతులకు అడ్డాలుగా రైతు వేదికలు
మగలో మానేడు అలికింది, పుబలో పుట్టెడు ఆలికింది ఒకటే అని పెద్దలు చెప్పేవారు. వాతావరణానికి అనుకూలంగా పంటలు వేసుకునేవారు. కానీ కేసీఆర్ వ్యవసాయాన్ని నియంత్రిస్తానన్నారు. ఎవరు ఏ పంట వేసుకోవాలో నేనే చెప్తా అన్నారు. ఆయన నిర్వాకంతో పంటలకు సరైన ధర లభించడం లేదు. ఆయన చేసిన పని వల్ల మొక్కజొన్నల ధర 2300 అయింది. ఒకసారి మక్కలు వద్దు అంటారు. ఇంకోసారి వేయండంటారు. ఒకసారి వరి వేయండంటారు ఇంకోసారి వద్దు అంటారు. దేశంలో వ్యవసాయాన్ని నియంత్రించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనన్నారు. వ్యవసాయ బొందిగ పిసికే ప్రయత్నం చేశారన్నారు ఈటల. తప్పు చేశాడు కాబట్టే తేలు కుట్టిన దొంగలాగా కేసీఆర్ చప్పుడు చేయడం లేదన్నారు. 5 వేల ఎకరాలకు ఒక రైతువేదిక కడతాను.. రైతులు ఏపంట వేసుకోవాలి? ధర ఉంటే ఎక్కడ అమ్ముకోవాలి? లేకపోతే ఏం చేయాలి? అని చెప్తా అన్నారు. కానీ… రామారెడ్డిలో రైతు వేదికలు తాళాలు వేసి ఉన్నాయన్నారు. రాత్రిపూట మందు పార్టీలకు అడ్డాలుగా మారాయి. కోతులకు నెలవయ్యాయన్నారు.

కేసీఆర్ కట్టించిన రైతువేదికలు, గ్రామపంచాయతీ భవనాలు, స్మశానవాటికలు, తడిచెత్త – పొడిచెత్త షెడ్డులు, సిమెంటు రోడ్డులు, మురికి కాలువలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో మాత్రమే కట్టారన్నారు ఈటల. కేంద్ర ప్రభుత్వం అంటే అవి కూడా మనం ఇచ్చిన పైసలే. మోడీ ఎప్పుడు కూడా డబ్బులకు నేను ఓనర్ను అని చెప్పలేదన్నారు. ప్రజల జీతగాన్ని తానని మోడీ అంటారన్నారు ఈటల. సేవ చేసే భాగ్యం భారత ప్రజానీకం ఇచ్చారని వారి రుణం తీర్చుకుంటున్నానని మోదీ చెప్తారన్నారు. మోడీ కూడా పెన్షన్లకు, బెడ్ రూమ్ ఇళ్లు, వ్యవసాయ యంత్రపరికరాలు, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్, చిన్న రైతులకు 6000 రూపాయల రైతుబంధు, పీఎంజీఎస్వై కింద రోడ్లకు డబ్బులు ఇస్తారని.. కానీ తానే ఇచ్చానని ఎక్కడ చెప్పుకోరని.. ఫోటో కూడా పెట్టమని అడగరన్నారు ఈటల. కానీ కేసీఆర్ మాత్రం నేను ఇచ్చిన కళ్యాణ లక్ష్మి, నేను ఇచ్చిన పెన్షన్, నేను వేసిన రోడ్లు అని చెప్పుకుంటారని దెప్పిపొడిచారు.

కేసీఆర్ ఫామ్ హౌస్ అమ్మో, ఆస్తులు అమ్మో, కూతురు ఆస్తులు అమ్మో జీతాలు ఇవ్వడం లేదన్నారు ఈటల. దేశంలో అత్యధికంగా తాగే రాష్ట్రం తెలంగాణ అని ఈటల విచారం వ్యక్తం చేశారు. బ్రాందీ షాపులు పక్కన సెట్టింగులు, రెస్టారెంట్లు, చివరికి ఏ కిరణా షాప్ చూసినా కూడా బెల్ట్ షాపులు పెట్టి మందు అమ్ముతున్నారన్నారు ఈటల. సిట్టింగ్ పక్కనే పోలీసు సెట్టింగ్ పెట్టి తాగి బయటికి రాగానే పైప్ పెట్టి ఫైన్లు వేస్తున్నారని దుయ్యబట్టారు. 2014లో తాగే సీసాలు అమ్మితే వచ్చే డబ్బు 10 వేల 700 వందల కోట్లు అయితే, ఈరోజు తాగుడు ద్వారా వచ్చే డబ్బులు 45 వేల కోట్లు. ఆడబిడ్డలారా అర్థం చేసుకోండి కేసీఆర్ బెల్ట్ షాపులతో తాగి చచ్చిపోతున్నారు. పుస్తెలతాడు కట్టడానికి 3000 రూపాయల ఖర్చు పెడితే మద్యం తాపించి ఆ పుస్తెలతాడు తెగిపోతుంటే 45 వేల కోట్లు లాక్కుంటున్నారన్నారు ఈటల. పుస్తెలతాడు తెగిపోయి బతుకుతున్న ఆడబిడ్డల సంఖ్య రోజురోజుకీ తెలంగాణలో పెరుగుతుందన్నారు.