Andhra Pradesh

వంతెన మూసినా తగ్గేదేలే

రాజమహేంద్రవరం వద్ద గల రోడ్ కమ్ రైలు వంతెనను తాత్కాలికంగా ఈ రోజు నుండి వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లుగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. రోజూ ఎన్నో రైళ్లు, ఇతర ప్రయాణ సాధనాలు ప్రయాణించే ఈ వంతెన మూసివేత ప్రజలకు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మరమ్మత్తుల కోసం మూసివేస్తున్నామని, ఈ వారం రోజులు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ, గామన్ వంతెనల మీదుగా వాహనాలను మళ్లిస్తామని అధికారులు తెలియజేశారు. విశాఖ నుండి విజయవాడ వైపుగా వెళ్లే రైళ్లన్నీ దాదాపు ఆ వంతెన పైనుండే ప్రయాణిస్తాయి.

ఈ నెల 17న రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే వంతెన మీదుగా అమరావతి రైతుల పాదయాత్ర వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వంతెనను మరమ్మత్తులంటూ మూసివేయడం వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. అమరావతి రైతు ఐకాస కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు మాట్లాడుతూ వంతెన మూసినంత మాత్రాన తమ మనోధైర్యం దెబ్బతినదని, తమ పాదయాత్ర మరో రెండు రోజులు పెరుగుతుందని అన్నారు. ఉన్న మార్గాలలోనే తమ ప్రయాణం సాగుతుందన్నారు. తమ పాదయాత్రకు ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయని, ఇప్పటికైనా మరమ్మత్తులు చేస్తే తమకు సంతోషమేనన్నారు.