దళారుల దందాలో నష్టపోతున్న రైతన్న
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసిన పాపానికి రైతులు నష్టపోతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కవిత బుధవారం ‘ఎక్స్’ (X) వేదికగా స్పందిస్తూ, దళారులే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలుగా మారి మద్దతు ధర కన్నా రూ.400 తక్కువ ధరకు మక్కలు కొనుగోలు చేస్తున్నారంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందని విమర్శించారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ వాగ్దానాలను ఎగ్గొట్టిందని, రైతులకు సమయానికి విత్తనాలు, ఎరువులు కూడా అందించలేకపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయలేని ప్రభుత్వం ప్రజల వ్యథలు పట్టించుకోలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తోందని కవిత ధ్వజమెత్తారు.
ప్రజలు త్వరలోనే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు.