దేశంలో ఇక రైతు ప్రభుత్వమే
దేశంలో ఇక రానున్నది రైతు ప్రభుత్వమే అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవల 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలు హైదరాబాద్వ చ్చి తనను కలిశారని, జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరారని చెప్పారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన తర్వాత జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న ప్రధాని మోదీకే మీటర్ పెట్టి ఇంటికి పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో రైతులు సాగు కోసం వినియోగిస్తున్న కరెంటు 20 శాతమేనని.. దీనికి ఉచిత విద్యుత్తు ఇస్తే పెద్దగా ఖర్చేమీ కాదన్నారు. మోదీ సర్కారు కార్పొరేట్లకు రాయితీల పేరుతో దోచి పెడుతున్న లక్షలాది కోట్ల రూపాయలతో పోలిస్తే.. రైతులకు ఇచ్చే ఉచిత కరెంటు భారమేమీ కాదన్నారు. మీటర్లు లేని కరెంటు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారని చెప్పారు. ధాన్యం కొనలేని బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిందే అన్నారు.

గోల్‌మాల్ ప్రధాని చెప్పేదంతా అబద్ధమే
బీజేపీ అవినీతి గద్దలు దేశాన్ని మోసం చేస్తున్నాయని.. మోదీ సర్కారు దేశంలో ధరలను విపరీతంగా పెంచుతోందని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దోపిడీ, మతకలహాలు మినహా మరే అభివృద్ధి జరగడం లేదన్నారు. అలాంటి దోపిడీ దొంగలైన బీజేపీ నేతల చెప్పులను ఇక్కడి బీజేపీ వాళ్లు మోయడం సిగ్గు చేటన్నారు. గుజరాత్ మోడల్ పేరుతో దేశాన్ని నాశనం చేశారని.. మోదీకి వ్యతిరేకంగా శ్రీలంకలోనూ ఆందోళనలు జరిగాయని గుర్తు చేశారు. గోల్‌మాల్ ప్రధాని చెప్పేదంతా అబద్ధమేనని.. గజ దొంగలు, లంచగొండులకు రాష్ట్రంలోనూ, దేశంలోనూ చాన్స్ ఇవ్వొద్దని పిలుపునిచ్చారు. మోసపోతే గోస పడతామని ప్రజలను కేసీఆర్ హెచ్చరించారు. ఒక్కసారి దెబ్బతింటే చాలా వెనక్కి పోతామని అలర్ట్ చేశారు. `కూలగొట్టడం అల్కటి పని. కట్టడం మాత్రం చాలా కష్టం. మన దేశ వ్యవస్థను కూలగొట్టే అవకాశం ఇవ్వొద్దు` అని సూచించారు. ఆత్మగౌరవంతో ఉందామా..? ఢిల్లీకి గులాములవుదామా..? అని ప్రశ్నించారు.