‘ఓజీ’ థియేటర్‌లో ఫ్యాన్స్ మీద స్పీకర్లు పడి గాయాలు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా విడుదల సందర్భంగా భద్రాచలంలోని ఏషియన్ థియేటర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓజీ సినిమా చూసేందుకు వచ్చిన అభిమానుల కోలాహలం కారణంగా థియేటర్‌లోని భారీ సౌండ్ స్పీకర్లు కూలి కింద ఉన్న జనాలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ఫ్యాన్స్‌కు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక స్పీకర్లు నేరుగా కింద ఉన్న ఇద్దరు ఫ్యాన్స్‌పై పడటంతో వారికి దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదానికి అసలు కారణం థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే అని అభిమానులు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. థియేటర్లో ఉన్న సామర్థ్యం కంటే దాదాపు 1200 మందికి పైగా ప్రేక్షకులను లోపలికి అనుమతించారని అభిమానులు మండిపడుతున్నారు. అభిమానుల ప్రాణాలతో చెలగాటం ఆడిన థియేటర్ యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.