National

డెంగీ రోగికి ప్లేట్లెట్లకు బదులు పళ్లరసాలు ఎక్కించారు

లక్నో: మనసర్కార్ :

కొన్ని సందర్భాలలో ఆస్పత్రులు రోగుల పాలిట యమలోక ద్వారాలవుతున్నాయి. లక్నోలోని ఒక డెంగీ రోగికి ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం వచ్చింది. అయితే నిర్లక్ష్యధోరణిలో ప్లేట్లెట్ల బదులు పండ్లరసం ఎక్కించినట్లు తెలిసింది. దీనితో ఆ రోగి మృతి చెందిన సంఘటన సంచలనం రేపింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆదేశాలను అనుసరించి అధికారులు ఆ ఆస్పత్రిని సీజ్ చేశారు.

వివరాలలోకి వెళ్తే ప్రయాగ్‌రాజ్‌లోని గ్లోబల్ హాస్పటల్ అండ్ ట్రామా సెంటర్‌లో 32 ఏళ్ల వయస్సున్న డెంగీ బాధితుడిని చికిత్స కోసం చేర్పించారు. ప్లేట్లెట్ల కౌంట్ తగ్గిపోవడంతో అతనికి ఐదు యూనిట్ల ప్లేట్లెట్లు ఎక్కించాలని వైద్యులు సూచించారు. అయితే మూడు యూనిట్లు ఎక్కించేసరికే అతని పరిస్థితి విషమించింది. బంధువులు వెంటనే దగ్గరలోని మరో ఆస్పత్రికి చేర్చగా అతడు కన్నుమూశాడు. రెండవ ఆస్పత్రి సిబ్బంది అతనికి ఎక్కించిన ప్లేట్లెట్ల బ్యాగు నకిలీదై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీనితో బంధువులు గ్లోబల్ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆ ప్లేట్లెట్ల బ్యాగు పండ్ల రసాలతో నింపినదని, అన్యాయంగా తన సోదరి భర్తను పోగొట్టుకుందని, ప్రభుత్వం ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని సౌరభ్ త్రిపాఠి అనే బంధువు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ప్రయాగ్ రాజ్ కలెక్టర్ సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు.

అయితే పేషెంట్ బంధువులు తెచ్చిన ప్లేట్లెట్ల బ్యాగులనే తాము ఉపయోగించామని, విచారణకు సహకరిస్తామని ఆస్పత్రి నిర్వాహకులు చెప్తున్నారు.