హైదరాబాద్‌లో నకిలీ మహాలక్ష్మి కార్డులు..కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
కాంగ్రెస్ ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, మహాలక్ష్మి పథకాలకు సంబంధించిన నకిలీ కార్డులను కొన్ని మీ సేవా కేంద్రాలలో ముద్రిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు ఇచ్చారు. పథకం పేరు, పార్టీ గుర్తు, స్థానిక ఎమ్మెల్యే పేరు, ఫొటో, లబ్దిదారుని పేరు, ఫోన్ నెంబర్లతో సహా ముద్రించి ఇస్తున్నారు. దీనితో ఆయా కేంద్రాల వద్ద జనాలు బారులు తీరి ఎదురుచూస్తున్నారు. షాద్‌నగర్‌లో సోమవారం నాడు మహాలక్ష్మికి సంబంధించిన నకిలీ కార్డులు కూడా వెలుగులోకి వచ్చాయి. మంగళవారం నాడు గోషా మహల్‌లో కూడా ఇవి కనిపించడంతో కలకలం రేగింది. దీనితో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సునీతా రావు ఈ విషయమై గోషా మహల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీజీపీకి కూడా ఫిర్యాదును అందజేశామని తెలియజేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి గుర్తింపు కార్డులు జారీ చేయలేదని, త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తారని తెలిపారు. ఒక్కో కార్డుకు రూ.200 నుండి రూ.500 వరకూ వసూలు చేస్తున్నట్లుగా సమాచారం లభించిందన్నారు.