తిరుమలలో నిఘా వైఫల్యం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హిందూ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భద్రతపై ఇటీవల కాలంలో నిఘా వైఫల్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఆనందనిలయం దృశ్యాలు తిరుమలలోని ఆ వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. సర్వత్ర ఆందోళనకు విమర్శలకు తావిచ్చిన ఈ ఘటన తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది పనితీరును ప్రశ్నిస్తుంది. ఒకవైపు మూడు అంచెల తనిఖీలు నిర్వహిస్తూ చీమచిటుక్కుమన్నా… ఆగమేగాలపై రంగంలోకి దిగే భద్రత దళాలు అప్రమత్తంగా ఉంటున్న చిన్నపాటి లోపాలు ఏడుకొండలస్వామి ఆలయ రక్షణకు అవాంతరాలుగా మారుతున్నాయి.

ఇందుకు నిదర్శనంగా నాలుగు నెలల క్రిందట ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన సిబ్బంది డ్రోన్ కెమెరాను ఏకంగా గోవిందుని ఆలయం ముందు ఆస్థానం మండపం వద్ద నుంచి ఆలయ పై భాగం పరిసరాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రసారం చేయటంతో పెద్ద దుమారం రేగింది. మరోవైపు ఆన్లైన్ దర్శనం టికెట్లు స్కాం విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఓ భక్తుడు నిర్వాకం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిఘాను వెక్కిరించింది. ఆదివారం రాత్రి సెల్ ఫోన్ తో శ్రీవారి ఆలయం ఆవరణలోకి ప్రవేశించిన భక్తుడు ఆలయంలో ఆనంద నిలయం దృశ్యాలను తన మొబైల్ లో చిత్రీకరించాడు. సెల్ఫోన్లో పలు వీడియోలు ఫోటోలు తీశాడు. ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి తీయడంతో పాటు శ్రీవారి ఆలయంలోని పలు ఉపాలయాలను కూడా ఫోటోలు తీశాడు.

స్వామి వారి దర్శనం అనంతరం వెళ్లిపోయిన సదరు భక్తుడు ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తుల తనిఖీల్లో నిఘా సిబ్బంది పనితీరు దీనికి అద్దంపడుతోంది. ఆలయంలోకి ప్రవేశించే సమయంలోనే మూడంచెల తనిఖీలు ఉంటాయి. ఇవన్నీ దాటుకొని సెల్ ఫోన్తో ఆలయంలోకి ప్రవేశించడం శ్రీవారి ఆనంద నిలయాలు దృశ్యాలను చిత్రీకరించడం వెనక అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పరిసరాలు సీసీ కెమెరాలు ఫోటోలు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ తెలిపారు.