మహారాష్ట్ర కాబోయే సీఎం ఫడ్నవీస్..?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి సంచలన విజయం దిశగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు. అయితే.. మరి కాసేపట్లో ఫడణవీస్ తో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే భేటీ కానున్నారు. కూటమి గెలిస్తే సీఎం కుర్చీ ఎవరు చేపడతారనే విషయంపై శనివారం ఉదయం వరకు సందిగ్ధత కొనసాగింది. బీజేపీ, శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ వర్గం) పార్టీల నేతలంతా తమ నాయకుడే సీఎం అవుతారంటూ ప్రచారం చేసుకున్నారు. అయితే, బీజేపీ సింగిల్ గానే మెజారిటీ వైపు దూసుకెళుతుండడంతో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే.. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి గెలుపు దిశగా దూసుకెళ్తున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.