వనస్థలిపురం కమ్మగూడలో తీవ్ర ఉద్రిక్తత..
హైదరాబాద్ లోని వనస్థలిపురం కమ్మగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. దాడుల్లో బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి.. పలు బైకులకు ప్లాట్ ఓనర్లు నిప్పు పెట్టారు.. కమ్మగూడ సర్వే నెంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంలో వివాదం చెలరేగింది. గత 20 సంవత్సరాల క్రితం కొన్న ప్లాట్స్, ఇల్లు నిర్మించుకుని ఉంటున్నామని .. భూకబ్జాదారులు వచ్చి గత కొద్ది రోజులుగా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ప్లాట్స్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం మెహదీపట్నం నుండి మహిళలను బస్సులలో తెచ్చి బెదిరించడానికి పాల్పడుతుండగా ప్లాట్ల యజమానులు అడ్డుకున్నారు. కబ్జాదారులను తరిమి కొట్టారు. వారికి చెందిన బైకులను తగలబెట్టి, మహిళలను తీసుకొచ్చిన బస్సు అద్దాలను ప్లాట్ల యజమానులు ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.

