రూ.25 వేల కోట్ల ప్యాకేజీతో ఎగుమతి ప్రోత్సాహం
భారత ప్రభుత్వం ఎగుమతుల ప్రోత్సాహానికి రూ. 25 వేల కోట్ల ఆర్థిక సహాయం ప్రకటిస్తూ “ఎగుమతి ప్రోత్సాహ మిషన్” ను కేబినెట్‌కు సమర్పించనుంది. ఈ ప్రతిపాదనను త్వరలో భారత కేంద్ర మంత్రివర్గం ఆమోదానికి సమర్పించనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మిషన్ ద్వారా ఎగుమతిదారులకు సబ్సిడీలు, ఇన్సూరెన్స్ కవర్లు, సాంకేతిక మద్దతు, మార్కెట్ యాక్సెస్ సహాయం వంటి పలు రకాల ప్రోత్సాహకాలు అందించనున్నారు. ముఖ్యంగా, అమెరికా వంటి దేశాలు విధిస్తున్న అధిక దిగుమతి సుంకాలు, వాణిజ్య పరిమితులు వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడమే దీని లక్ష్యంగా ఉంది. ప్రభుత్వ వర్గాల వివరణ ప్రకారం, ఈ పథకం వల్ల చిన్న, మధ్య తరహా ఎగుమతిదారులు అంతర్జాతీయ మార్కెట్ లో మరింత పోటీతత్వం సాధించగలరని, ఉద్యోగావకాశాలు పెరగడంతో పాటు విదేశీ మారక ద్రవ్య ప్రవాహం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం భారత ప్రభుత్వం ఎగుమతుల వృద్ధిని వేగవంతం చేయాలనే ప్రయత్నంలో భాగంగా తీసుకుంటున్న కీలక చర్యగా భావిస్తున్నారు. కేవలం ముడి సరుకులు కాకుండా ప్రాసెస్డ్, హై-వాల్యూ ఉత్పత్తుల ఎగుమతిని పెంచడం. కొత్త దేశాల్లో మార్కెట్‌ను విస్తరించడం, భారతదేశంలో తయారైన ఉత్పత్తులు, సేవలను అంతర్జాతీయ మార్కెట్లకు ప్రోత్సహించడం, ఎగుమతులను పెంచడం, దేశానికి విదేశీ మారకాన్ని సమకూర్చడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశ్యం. ఈ ప్యాకేజీతో వ్యవసాయ ఉత్పత్తిదారులు, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు, హ్యాండీక్రాఫ్ట్, హ్యాండ్లూమ్ కార్మికులు, ఐటి, స్టార్టప్ రంగం, పెద్ద ఎగుమతి సంస్థలు లాభపడతాయని పేర్కొన్నారు. ఇది అమల్లోకి వస్తే, భారత్ 2025–30 మధ్య ఎగుమతుల విలువను గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంది.