Andhra PradeshNews

ఏపీ నుండి జాకీ కంపెనీ నిష్క్రమణ-చంద్రబాబు ఆగ్రహం

ఏపీ ప్రభుత్వ వేధింపుల వల్ల ఒక్కో పరిశ్రమ ఏపీ నుండి పలాయనం చిత్తగిస్తోంది. తాజాగా జాకీ సంస్థ తన పెట్టుబడులను ఉపసంహరించడానికి సిద్ధపడింది. అనంతపురం జిల్లా రాప్తాడుకు దగ్గరలో జాకీ సంస్థ ఏర్పాటు చేయడానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 27 ఎకరాల స్థలం కేటాయించింది. 129 కోట్ల రూపాయల పెట్టుబడితో కర్మాగారాన్ని, గిడ్డంగిని అక్కడ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు. దానికి స్థలం కేటాయింపులు, ఇతర సన్నాహాలు పూర్తయ్యాయి. కానీ 2019లో ప్రభుత్వం వైసీపీ హస్తగతమయ్యింది. ఆ పార్టీకి చెందిన ఒక ప్రతినిధి కన్ను ఈ జాకీ కర్మాగారంపై పడింది. దీనితో తనకు ఎన్నికలలో ఖర్చయిన 20 కోట్ల రూపాయలు ఆ కంపెనీ నుండి రాబట్టేందుకు ప్రయత్నించాడు.

కంపెనీకి సంబంధించిన సబ్ కాంట్రాక్టులు, ఉద్యోగాలు తాను చెప్పిన ప్రకారమే ఇవ్వాలని, వారిని ఒత్తిడి చేయసాగాడు. గత్యంతరం లేని జాకీ కంపెనీ మీ భూమిని మీరు తీసుకుని మేం కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు.  అంతే కాదు తెలంగాణా ప్రభుత్వం ఈ పరిశ్రమను సాదరంగా ఆహ్వానించడం ఆంధ్రప్రభుత్వానికి సిగ్గుచేటుగా మారింది. తెలంగాణా ప్రభుత్వం ఇబ్రహీం పట్నం, ములుగుల్లో యూనిట్లు పెట్టడానికి సహకరింస్తోందని అందుకే ఈ నిర్ణయానికి వచ్చామని తెలియజేశారు.

ఈ వార్తను తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన ట్వీట్‌లో షేర్ చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరిశ్రమలను ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లగొడుతోందని, రాయలసీమ ద్రోహులు ఎవరో ఇప్పడు సమాధానం చెప్పాలన్నారు. రాయలసీమకు తాము పరిశ్రమలు తీసుకువచ్చామని గుర్తు చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ తెచ్చిన పెట్టుబడులను, పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం తరిమేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడడాన్ని విమర్శించారు.