Home Page SliderNational

Exclusive: కేజ్రీవాల్ నిలుస్తాడా? గెలుస్తాడా?

రాజకీయాల్లో బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అన్నది సర్వసాధారణంగా కన్పిస్తుంటుంది. కొందరు ఎప్పుడు ఎందుకు ఎలా గెలుస్తారన్నది ఊహించడం కష్టం. ఢిల్లీలో నాడు షీలా దీక్షిత్ హాట్రిక్ విజయాల తర్వాత ఆ పార్టీ అక్కడ కన్పించకుండా పోయింది. 2014లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. 2019లో సత్తా చాటిన బీజేపీ 2024 లోక్ సభ ఎన్నికల్లో గెలిచాంలే అనుకొని సరిపెట్టుకుంది. మళ్లీ లోక్ సభ ఎన్నికలు నాలుగున్నరేళ్ల తర్వాత జరుగుతాయ్. అప్పటి వరకు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయ్. అయితే ఆ ఎన్నికలు దేశ రాజకీయాలను తప్పకుండా ప్రభావం చూపిస్తాయ్. సొంతంగా మెజార్టీ ఉన్నప్పుడే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సిద్ధాంతాన్ని అమలు చేయడంలో ఇబ్బందులెదుర్కొన్న మోదీ ఇప్పుడు తాను ఎలా ఎన్నికల ప్రక్రియను మార్చుతారన్నది చూడాల్సి ఉంది. ఈ తరుణంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై, ఢిల్లీ పెద్దల ఆగ్రహాన్ని చవిచూసిన కేజ్రీవాల్ ఇప్పుడు బయటకు వచ్చి తాను అగ్నిపునీతమవుతానంటూ చేస్తున్న హెచ్చరికలు దేశ రాజకీయాల్లో కొత్త శకాన్ని పూరించే అవకాశం కన్పిస్తోంది. దేశంలో ఈసారి రాజకీయ పరిణామాలు అనూహ్యమవుతాయన్న భావన వ్యక్తమవుతున్న తరుణంలో కేజ్రీవాల్ ఏం చేస్తారు? ఎలా చేస్తారన్నది చూడాల్సి ఉంది. !

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం చేసిన నాటకీయ ప్రకటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. సీఎం పీఠం నుండి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో, ఒక్కసారిగా రాజకీయమంతా ఆయన చుట్టూ తిరుగుతోంది. రాజకీయాల్లో మిగతా వారికి తాను ఎలా భిన్నమన్నది ప్రూవ్ చేసుకోవడం కోసం కేజ్రీవాల్ ఒక సాహసం చేస్తున్నారన్న భావన వ్యక్తమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలతో ఆరు నెలలపాటు తీహార్ జైలులో కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తూనే వచ్చింది. ఐతే తాను ఎలాంటి అపరాధం చేయలేదని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఇన్నాళ్లూగా కేజ్రీవాల్ చెబుతూ వచ్చారు. వాస్తవానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాడే కేజ్రీవాల్, దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాల పట్ల ఎందరో స్ఫూర్తి పొందారు. అరెస్టయ్యాక కూడా పదవిలో కొనసాగాలని ఆయన ముందుగా నిర్ణయించుకున్నప్పటికీ, యథాతథ స్థితి ఆయనకు మైనస్ అయ్యేలా మారింది.

కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో ఢిల్లీ వాసులు చాలా ఇబ్బందులెదుర్కొన్నారు. పాలనా లోపాన్ని కళ్లారా చూశారు. రుతుపవనాలతో వరదలతో ఢిల్లీ పౌరులు ఇబ్బందులెదుర్కొన్నారు. AAP మున్సిపాలిటీని నియంత్రిస్తున్నందున, నగర కష్టాలను కారణం బీజేపీ అని చెప్పడానికి కుదరని పరిస్థితి. బీజేపీ ఆధీనంలో ఉన్న NDMC ప్రాంతం మాత్రమే అందుకు మినహాయింపు. దేశ రాజధాని ఢిల్లీలో ఉండే పౌరులు సత్వరం పరిష్కారం కోరుకుంటారు. ప్రభుత్వం నుంచి నాణ్యమైన సేవను ఆశిస్తారు. ఈ పరిస్థితులన్నీ కూడా కేజ్రీవాల్‌కు, ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రతికూలంగా మారాయి. తాను ప్రజాకోర్టులో నిర్దోషిగా రుజువు చేసుకున్నాకే, సీఎంగా బాధ్యతలు చేపడతానంటూ కేజ్రీవాల్ ప్రకటించారు. వచ్చే ఎన్నికలకు తనకు అగ్నిపరీక్ష అని పేర్కొన్నారు. 11 ఏళ్లుగా తనకు, పార్టీకి మద్దతుగా నిలిచిన ఢిల్లీ ఓటర్లకు తాను నిర్దోషినని చెప్పుకొచ్చారు. అయితే కేజ్రీవాల్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.

వాస్తవానికి కేజ్రీవాల్‌పై సుప్రీం కోర్టు విధించిన ఆంక్షలతో ఆయన కార్యాలయానికి హాజరుకాలేని పరిస్థితి. అధికారిక హోదాతో ఫైళ్లపై సంతకం చేయలేరు. కేవలం పేరుకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాల్సి ఉంటుంది. దీంతో కేంద్రం పలు అంశాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్‌తో అనేకసార్లు ఆప్ గర్షణ ఎదుర్కొంది. కేంద్రం చేసిన అనేక సవరణలతో AAP ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేయడానికి ప్రతిబంధకంగా మారింది. కేజ్రీవాల్ రాజీనామాతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి రాకుండా నిరోధించే ఎత్తుగడ ఆయన అవలంబించారని భావించాల్సి ఉంటుంది.

పులిపై స్వారీ చేస్తున్న కేజ్రీవాల్
ఢిల్లీ రాజకీయ భవిష్యత్తును అంచనా వేయడంలో ఓటర్ల ట్రాక్ రికార్డ్ చూడాల్సి ఉంటుంది. బోఫోర్స్ ఒప్పందంపై నాడు మాజీ ప్రధాని వీపీ సింగ్ చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం, నాడు రాజీవ్ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీని గద్దె దింపింది. అదే విధమైన అవినీతి వ్యతిరేక ప్రచారం అన్నిసార్లు ఫలితాలను ఇవ్వలేదు. ఎన్నికల్లో విజయాలుగా మారనూలేదు. కేజ్రీవాల్ తన ప్రతిష్టను నిలబెట్టుకునేందుకు ప్రజల నుండి ఆమోదం కోరుతున్నారు. కేజ్రీవాల్ ఎత్తుగడ రాజకీయ గుర్తింపుకు కేంద్రంగా ఉన్న ఢిల్లీలో AAP ఆధిపత్యాన్ని తిరిగి పునఃస్థాపించే వ్యూహంలో భాగం కావొచ్చు. ఢిల్లీలో అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆప్ ఏర్పాటుకు కారణమైంది. 2014లో దాని పరిమితులను గుర్తించిన తర్వాత, పార్టీ 2014లో పంజాబ్‌లో 2022లో గణనీయమైన విజయాన్ని సాధించింది.

ఎట్టకేలకు కేజ్రీవాల్ ప్రకటన విపక్షాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఢిల్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీకి ఢిల్లీలో కేజ్రీవాల్‌ను ఢీకొట్టే స్పష్టమైన ముఖమే లేదు. ఇప్పుడు రాజధానిలో కాంగ్రెస్ పార్టీ అంతంతగానే ఉంది. సీనియర్ స్థానిక నాయకులలో ఒకరిని ప్రత్యామ్నాయంగా ముందుకు తేవచ్చు. కేజ్రీవాల్ చెబుతున్నట్టుగా నవంబర్‌లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయా అన్నది తేలాలి. “కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?” ఇది చాలా మంది ఎదురుచూస్తోన్న ప్రశ్న. మంత్రులు గోపాల్ రాయ్, అతిషి, సౌరభ్ భరద్వాజ్, స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ వంటి పార్టీ సహచరుల్లో ఒకరికి అవకాశం ఉంది. కేజ్రీవాల్ తన సతీమణి సునీతను సీఎం చేస్తారన్న ఊహాగానాలు కూడా విన్పిస్తున్నాయి.