Home Page SliderNational

Exclusive సొంత ఫ్యామిలీ లేదు.. ఐతేనేం ఎందరినో తనవాళ్లను చేసుకున్నాడు!

మార్చి 3. దేశంలో మిగిలిన ప్రాంతాలకు ఇది చాలా ముఖ్యమైన రోజు కానే కాదు. కానీ వారికి మాత్రం ఆ రోజు ఎంతో పవిత్రమైనది. అది జార్ఖండ్ జంషెడ్‌పూర్‌లో ఒక ప్రాంతం వాసులకు ఎంతో ముఖ్యమైన రోజు. ఆ రోజు అక్కడి ప్రజలకు దీపావళి, రంజాన్, క్రిస్మస్ మూడు పండుగలు ఒకే రోజు వచ్చినట్టుగా ఉంటుంది. జంషెడ్‌పూర్‌కు స్టీల్ ప్లాంట్, పేరు, గుర్తింపును అందించిన జంషెడ్‌జీ టాటా జన్మదినాన్ని పురస్కరించుకుని ఆరోజు అక్కడ ప్రజలు పండుగ జరుపుకుంటారు. మార్చి 3 ప్లాంట్‌లో ఫ్యామిలీ డే అట్టహాసంగా జరుగుతుంది. వేలాది మంది ఉద్యోగులు ఆ రోజు పొద్దుగాలే లేచి, టిప్ టాప్‌గా తయారై, టాటా స్టీల్ ప్లాంట్ భారీ గేట్లలోకి ప్రవేశించి సంబరాలు జరుపుకుంటారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, కేక్‌ కటింగ్‌లు.. ఇలా ఒక సంరంభం రోజంతా జరుగుతుంది. రతన్ టాటాను చాలా మంది అక్కడే తొలిసారి చూస్తారు. ప్రతి సంవత్సరం కార్యక్రమాలు పూర్తయ్యాక టాటా ఉద్యోగులు, వారి కుటుంబాలు అక్కడ సమావేశమవుతుంటాయి. రెగ్యులర్‌గా తాను ధరించే చొక్కా, ప్యాంటుతో రతన్ టాటా వచ్చి, సిబ్బందితో మరీ ముఖ్యంగా వారి పిల్లలతో సంభాషిస్తారు. వారెవరూ కూడా టాటాలో సీనియర్ ఉద్యోగులు కారు. స్టీల్ ప్లాంట్‌లో పనిచేసే చోటామోటా ఉద్యోగులు. వీరందరికీ టాటా కంపెనీ తప్ప మరో ప్రపంచం తెలియదు. మార్చి 3న రతన్ టాటా స్వీట్లు అందిస్తుంటే వారంతా ఉబ్బితబ్బిబ్బవుతారు. అక్కడ కొంత సేపు గడిపాక ఆయన వెళ్తారు. అయితే ఆ రోజు అక్కడి ఉద్యోగులకు సంవత్సరమంతా గుర్తుంటుంది. ఆ భావనతోనే తమ విధులను నిర్వర్తిస్తారు.

టాటా మరణించారనే వార్త అర్ధరాత్రి తెలవడంతో చాలా మంది ఎంతో బాధపడ్డారు. ఆవేదన పొందారు. సమాధానం బహుశా జంషెడ్‌పూర్‌కి, రతన్ టాటా లేదా ఇంతకు ముందు ఏ టాటాకు బాస్ లేదా చైర్మన్ కాదు. వారు తమ ఉద్యోగాలకు మాత్రమే కాకుండా వారి నగరానికి సంరక్షకులుగా ఉన్నారు. అనేక మంది ఇళ్లలో జంషె‌డ్‌జీ టాటా ఫోటోలు దర్శనిమిస్తాయి. నగరంలోని రోడ్లపై జంషెడ్‌జీ టాటా విగ్రహాలు అడుగడుగునా కన్పిస్తాయి. అవి చూసినప్పుడల్లా అక్కడి ప్రజలు వాటి గురించి మాట్లాడుకుంటూ, ఆ రోజులను స్మరించుకుంటారు. చాలా మంది ప్రజలు ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా తల వంచుకోవడాన్ని చూడవచ్చు. జంషెడ్‌పూర్ వాసులకు, ‘టాటా’ అనేది కేవలం పేరు మాత్రమే కాదు.. వారు పనిచేసిన కంపెనీ పేరు మాత్రమే కాదు. అది వారి, వారి కుటుంబాలకు తీసుకొచ్చిన గౌరవమని వారు భావిస్తారు. జెఆర్‌డి టాటా తర్వాత టాటా గ్రూప్ పగ్గాలు చేపట్టినప్పుడు, రతన్ టాటాకు ఈ వారసత్వమే లభించింది. ప్రపంచం మారుతున్నప్పటికీ, సరళీకరణ భారత ఆర్థిక వ్యవస్థను మార్చేస్తున్న రోజులవి. ఇలాంటి పరిస్థితుల్లో, యజమాని-ఉద్యోగి సంబంధానికి ఆయన హయాంలో కొత్త నిర్వచనం లభించింది. వారసత్వంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాక, మరింత వన్నె తెచ్చాడు రతన్ టాటా. ఇండియాలో మేటి గ్రూప్‌గా టాటా పేరును సుస్థిరం చేశారు రతన్. ఓవైపు సంస్థ ఆదాయం అంతకంతకూ పెరగడం, కోరస్ వంటి కీలక కొనుగోళ్లు, టాటా మోటార్స్ విస్తరణతో దేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో టాటాను ఒక బ్రాండ్‌గా మార్చేశారు రతన్ టాటా. కానీ టాటా తాను ప్రాతినిధ్యం వహించిన వారసత్వాన్ని ఎప్పుడూ విడలేదు. ‘టాటా’ నుండి వేలాది మంది ఉద్యోగుల అంచనాలను వమ్ముచేయలేదు. ఎందరో తల్లులు, తండ్రులు టాటా కంపెనీలో పనిచేసినా, చేయకున్నా, ఆయన గురించిన సమాచారం ఉన్నవారు, రతన్ టాటా మరణ వార్త విని కన్నీరు పెట్టుకున్నారంటే అది ఆయన ఎలాంటి మార్క్ వేశారన్నది ఊహించవచ్చు.

రతన్ టాటాకు ఇంతటి ఖ్యాతి అంత తేలిగ్గా ఏం రాలేదు. అమ్మమ్మ ఒత్తిడితో అమెరికా నుండి తిరిగి వచ్చిన కొన్ని రోజుల తర్వాత, ఎందుకు తాను అక్కడికి వచ్చాడో తెలుసుకున్నాడు. ఒకానొక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రతన్ టాటా నేరుగా చెప్పాడు. “నేను ఎంతో సంతోషంగా ఉద్యోగం చేసుకుంటున్నా. మా అమ్మమ్మ నన్ను తిరిగి ఇండియా వచ్చేలా మాట్లాడింది. నేను ఆమె మాటలను కాదనలేకపోయాను. ఆమె కోసమే నేను తిరిగి వచ్చాను” అంటూ ఆయన చెప్పాడు. ఉక్కు నగరంతో తన ప్రారంభం ఎలా జరిగిందో కూడా పూసగుచ్చినట్టు మరీ చెప్తాడు. “నన్ను భిన్నంగా చూడకూడదని అందరూ ఆందోళన చెందుతున్నట్లు అనిపించింది. నన్ను అప్రెంటిస్ హాస్టల్‌లో ఉండమని చెప్పారు. నేను ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో పనిచేశాను. అక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. కానీ ఆ రోజులు గుర్తుంచుకుంటే అవి తిరిగిరావు. ఎంతో విలువైనవి. ఎందుకంటే నేను కార్మికులతో చేతులు కలిపి ఫ్యాక్టరీలో పని పరిస్థితులను కళ్లారా చూడగలిగాను.” 1997 ఇంటర్వ్యూలో, టాటా గ్రూప్ కోసం మీ ప్రణాళికలు ఏంటని టాటాను అడిగ్గా ఆయన అందుకు వెరైటీగా బదులిచ్చారు. “2 వేల సంవత్సర ఆరంభం నాటికి లక్ష కోట్లకు పైగా ఆదాయాలు కలిగిన కంపెనీగా టాటా ఉండాలనుకుంటున్నా. మరీ ముఖ్యంగా, మనం నివసించే సంఘం గురించి మనం స్పృహతో ఉండాలి” అని ఆయన బదులిచ్చారు. సంస్కరణల మధ్య ఈ సమతుల్యత, సంప్రదాయాన్ని పరిరక్షించేలా ఆయన తన పదవీకాలంలో నిర్ణయాలు తీసుకున్నారు. జంషెడ్‌పూర్ ఆ మార్పునకు అద్దం పట్టింది. కొత్త రోడ్లు వచ్చాయి. ఉక్కు కర్మాగారం విస్తరించింది, కానీ పచ్చని చెట్లు, చేమలు కనుమరుగు కాలేదు. వటుడింతైనా అన్నట్టుగా నగరం అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించినా, తన అస్తిత్వాన్ని మాత్రం నిలబెట్టుకుంది.

ఎందరో టాటా స్టీల్ ప్లాంట్‌లో పని చేస్తూ మృత్యువాతపడ్డారు. ఉక్కు తయారీ కేంద్రంలో విషాదకరమైన ప్రమాదాల్లో భర్తలను కోల్పోయిన అనేక మంది వితంతువులు, తిరిగి జీవితం ఆరంభించేందుకు ఉద్యోగాల్లో చేరతారు. అలా టాటా సంస్థల్లో ఉద్యోగాలు చేరినవారికి వసతి, ఆరోగ్య సంరక్షణ, అనేక ఇతర ప్రోత్సాహకాలను అందించారు. ఇది ఉద్యోగులు తమ పిల్లల చదువుల కోసం డబ్బును ఖర్చు చేసేందుకు వీలు కలిగించేది. యువత కొత్త ఆలోచనలను చేరుకునేందుకు ఈ పరిణామం సహకరించింది. రతన్ టాటా, అంబానీలా, అదానీలా ‘అత్యంత ధనవంతుల’ జాబితాలో చోటు పొందకపోవచ్చు. కానీ ఆయన ప్రశాంతంగా అంతిమ శ్వాస వదిలారు. తన కంపెనీ విధానాలు చాలా కుటుంబాల్లో, సామాజిక అంతరాలను చెరిపి వారిని తీర్చిదిద్దేందుకు సహకరించాయి. టాటా హయాంలో తీసుకున్న క్లిష్ట నిర్ణయాలలో టాటా స్టీల్ శ్రామిక శక్తి ఖర్చులను తగ్గించడానికి చేసిన కార్యక్రమాన్ని ఎవరూ కూడా ఊహించలేరు. 2000వ దశకం ప్రారంభంలో, టాటా స్టీల్ ఎర్లీ సెపరేషన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా, నిష్క్రమించిన ఉద్యోగులు వారి జీతాల కంటే 1.2 లేదా 1.5 రెట్లు సమానమైన నెలవారీ పెన్షన్‌ను పొందేలా చర్యలు తీసుకున్నారు. ఖర్చులను తగ్గించడం అవసరం అయినప్పటికీ, టాటా స్టీల్ ఇప్పటికీ ఒకేసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం వంటి విషయంలో ఎన్నడూ తప్పు చేయలేదు. ఒకేసారి ఉద్యోగులను తొలిగించే క్రూరమైన నిర్ణయానికి బదులు ఉద్యోగులతో స్నేహపూర్వక విధానాన్ని అవలంబి.. ప్రపంచానికే ఆదర్శంగా నిలిపారు టాటా.

ఓ ఇంటర్వ్యూలో తాను భార్య, కుటుంబం లేని కారణంగా ఒంటరిని భావించానని చెప్పాడు. “కొన్నిసార్లు నేను దాని గురించి ఆలోచిస్తాను. కొన్నిసార్లు మరొకరి భావాల గురించి చింతించకుండా స్వేచ్ఛను అనుభవిస్తాను” అని చెప్పాడు. ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగిన ప్రశ్నకు, టాటా ఇలా బదులిచ్చారు. “మొత్తంగా అనేకసార్లు పెళ్లి చేసుకోవడానికి చాలా దగ్గరగా వచ్చాను, కానీ అలా జరగలేదు. ” ఈ మాటల ద్వారా రతన్ టాటా, కుటుంబాన్ని నిర్మించుకోకపోయి ఉండొచ్చు. కానీ ఒక నగరం, దేశం గర్వించే ప్రాంతాన్ని తీర్చిదిద్దడం చిన్న విషయం ఏమీ కాదు. రతన్ టాటా వ్యక్తిత్వంలోని విభిన్న కోణాల గురించి మరింతగా మాట్లాడొచ్చు. వ్యాపార దిగ్గజం, పరోపకారి, కుక్కల ప్రేమికుడిగా ఆయనను అందరూ గుర్తుంచుకుంటారు. అయితే ఇప్పటికీ రతన్ టాటా పేరు చెప్తే.. ఆయన మార్చి 3న స్టాండ్స్‌లో ఉన్న ఉద్యోగుల పిల్లల వద్దకు వెళ్లి ఫౌండేషన్ డే శుభాకాంక్షలు చెప్పడాన్ని గుర్తుంచుకోవాల్సిందే. నేడు ఆ పిల్లలు ఎదగడానికి ఒక సుందరమైన నగరం, వారు కోరుకున్న కలల వృత్తిని కొనసాగించడానికి ఆర్థిక స్థిరత్వాన్ని పొందడం వెనుక టాటా ముందు చూపు గుర్తుంచుకోవాలి. చివరిగా ఒక మాట… టాటా, మీరు ఈ లోకం నుంచి వెళ్లిపోయినా, మీరు తీర్చిదిద్దిన లక్షలాది మంది మీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు.