Home Page SliderTelangana

పరీక్ష పేపర్ లీక్, బండి సంజయ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టయిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు హన్మకొండ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సంజయ్‌తో పాటు అరెస్టయిన మరో ఇద్దరు వ్యక్తులను ఖమ్మం జైలుకు తరలించారు. కేసులో ప్రధాన నిందితుడిగా (ఏ1) బండి సంజయ్‌ను పేర్కొన్నారు. కమలాపూర్ పోలీసులు సంజయ్‌పై ఐపీసీ సెక్షన్లు 120 (బి) (కుట్ర), 420 (మోసం), 447 (నేరపూరిత అపరాధం), 505 (1) (బి) కింద అభియోగాలు మోపారు. హన్మకొండ కోర్టు కాంప్లెక్స్‌ వెనుక ఉన్న అధికారిక క్వార్టర్‌లోని మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచి రాత్రి 8 గంటలకు రిమాండ్‌కు తరలించారు. బండి సంజయ్ బెయిల్ పిటిషన్ విచారణ గురువారానికి వాయిదా పడింది. మంగళవారం, ఈ విషయానికి సంబంధించి నమో ఉద్యోగి, సంజయ్ సోషల్ మీడియా సలహాదారు బూరం ప్రశాంత్‌తో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ఎస్‌ఎస్‌సీ పరీక్షలో వదంతులు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు బండి సంజయ్‌, మరో ముగ్గురితో కలిసి నేరపూరిత కుట్ర చేసినందుకు అరెస్ట్ చేసినట్టు వరంగల్ పోలీసులు తెలిపారు. నిందితులందరికీ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. పదో తరగతి హిందీ పేపర్ లీక్ కేసులో మైనర్ సహా ముగ్గురిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాలకే పేపర్ వాట్సాప్‌లో షేర్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ తర్వాత కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అరెస్టు అక్రమంటూ చేస్తున్న విమర్శలపై వరంగల్ కమిషనర్ AV తప్పుబట్టారు. చట్ట ప్రకారం, ఎంపీ అరెస్టు గురించి లోక్‌సభ స్పీకర్‌కు తెలియజేసినట్లు తెలిపారు. మంగళవారం ఎగ్జామ్ సెంటర్‌లో సెకండ్ లాంగ్వేజ్ హిందీలో ఎస్‌ఎస్‌సీ పేపర్ లీక్ అయిందని ఏవీ రంగనాథ్ మీడియాతో అన్నారు.

వికారాబాద్‌లో జరిగిన ఎస్‌ఎస్‌సి పేపర్ లీక్ పరిస్థితిని ఉపయోగించుకోవాలని బండి సంజయ్ ప్రశాంత్‌కు ఆదేశాలు ఇచ్చారని, బుధవారం కూడా జరిగితే అది ప్రభుత్వ పరువు పోతుందని… రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని ప్రయత్నించారని పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కరీంనగర్ ఎంపీ ఇతర బీజేపీ కార్యకర్తలతో కలిసి కుట్ర పన్నారని పోలీసులు ఆరోపించారు. ఏప్రిల్ 4న ప్రశ్నపత్రాలను లీక్ చేయడం, కాపీ చేయడంపై నిందితులు కుట్ర పన్నారని నిందితుల ఫోన్‌లు, వాట్సాప్ చాట్‌ల కాల్‌ వివరాలను విశ్లేషించడం ద్వారా సాంకేతిక ఆధారాలు నిర్ధారణయ్యాయని చెప్పారు. ముగ్గురు నిందితులు ఎం శివ గణేష్ (18), బి ప్రశాంత్ (33), మాజీ జర్నలిస్టు బి ప్రశాంత్ (33), ల్యాబ్ అసిస్టెంట్ జి మహేష్‌లను కుట్రలో భాగమని పోలీసులు నిర్ధారించారు.

కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పల ప్రభుత్వ పాఠశాలలో మరొకరికి పరీక్ష రాయడానికి సహాయం చేయాలనుకున్నాడు. మంగళవారం, పరీక్ష ప్రారంభమైన తర్వాత ఉదయం 9:30 గంటలకు కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలోని మొదటి అంతస్తుకు వెళ్లి మొబైల్ ఫోన్ సహాయంతో ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత దాన్ని వాట్సాప్ ద్వారా మరో గణేష్‌తో పంచుకున్నాడని నిర్ధారించారు. ఉదయం 9:59 గంటలకు శివ గణేష్ ద్వారా ‘SSC 2019- 20’ అనే వాట్సాప్ గ్రూప్‌కు సందేశం ఫార్వార్డ్ చేసినట్టు తేల్చారు. మహేష్ ఆ మేసేజ్‌ను ప్రశాంత్‌కి ఫార్వార్డ్ చేసాడని… ప్రశ్నపత్రం ఫోటోను ‘Cnu ఫ్రెండ్స్’తో సహా వివిధ గ్రూపులకు ఫార్వార్డ్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ‘బ్రేకింగ్ న్యూస్’ , ‘క్వశ్చన్ పేపర్ లీక్’ అనే క్యాప్షన్‌లతో వివిధ వాట్సాప్ గ్రూపుల ద్వారా వైరల్‌ చేసినట్టు గుర్తించారు. ప్రశాంత్ బండి సంజయ్‌కి కూడా ఈ సందేశాన్ని పంపించాడు. గంటలో 146 కాల్స్ చేసినట్టు పోలీసులు తేల్చారు. IPC సెక్షన్ 120 (B), 420, 447, 505 (1)(b), సెక్షన్ 4 (A), 6 తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం, 66D IT చట్టం కింద కేసు నమోదు చేశారు.