అచ్యుతాపురం సెజ్ మృతులకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా
ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో సెజ్‌లోని సాహితీ ఫార్మా కంపెనీలో ఏర్పడిన భారీ అగ్నిప్రమాద మృతులకు ఏపీ ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ విషయం ఏపీ మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. జనగానపల్లికి చెందిన పైలా సత్తిబాబు, విజయనగరం జిల్లాకు చెందిన ఉప్పాడ తిరుపతి అనే వ్యక్తులు విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు ఆర్పడానికి వచ్చిన ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది కూడా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ కేజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఎన్డీఆర్‌ఎఫ్ బృందం కూడా సంఘటనా స్థలానికి వచ్చింది. రియాక్టర్ పేలడంతో సిబ్బంది హడావుడిగా పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ఏర్పడిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 11 అగ్నిమాపక వాహనాలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మంటల వల్ల చుట్టుపక్కల పరిశ్రమలకు కూడా మంటలు వ్యాపిస్తాయని, స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.


 
							 
							