హిమాచల్‌లో గెలిచినా సీఎం పీఠం కోసం కాంగ్రెస్‌లో ఫైటింగ్
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని దివంగత మాజీ సీఎం వీరభద్రసింగ్ సతీమణి ప్రతిభా సింగ్‌కు ఇవ్వాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ రేసులో మరికొందరు నేతలున్నారు. ప్రతిభా సింగ్‌తో పాటు ఇద్దరు సీఎం పీఠం కోసం పోటీపడుతున్నారు. సుఖ్విందర్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి సీఎం రేసులో ఉన్నానంటున్నారు. అందుకే బీజేపీ ఏం చేస్తుందోనన్న బెంగ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అధికారం కోసం ఎవరినైనా చీల్చి, బీజేపీతో చేతులు కలుపుతారేమోనని ఆ పార్టీ ఆందోళనగా ఉంది. గత ఏడాది మరణించే వరకు పార్టీకి ముఖ్యనేతగా ఉన్న వీరభద్రసింగ్… రాష్ట్రంలో దశాబ్దాల పాటు నేతృత్వం వహించారు. ప్రతిభా సింగ్ కుమారుడు, ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్ మాట్లాడుతూ.. కొడుకుగా ప్రతిభాజీకి పెద్ద బాధ్యత రావాలని కోరుకుంటున్నానన్నాడు. అయితే ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారనే దానిపై ఆయన ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అదే సమయంలో కొడుకుగానే కాకుండా, నేను పార్టీకి బాధ్యతాయుతమైన నాయకునిగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తానన్నాడు. ప్రజలు కోరుకునేది పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందని నమ్ముతున్నానన్నాడు.

విక్రమాదిత్య సింగ్ సిమ్లా రూరల్ సీటు నుంచి విజయం సాధించాడు. తండ్రి వారసత్వాన్ని అందుకున్నాడు. వీరభద్ర సింగ్ చూపించిన బాటలో నడుస్తామని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ గెలుపుతో స్వర్గంలో తన తండ్రి ఎంతో ఆనందపడతారన్నాడు. వీరభద్ర సింగ్ మరణంతో ఖాళీ అయిన మండి నుంచి ప్రస్తుతం ప్రతిభా సింగ్ లోక్ సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆమెతో పాటు మరో ఇద్దరు పోటీదారులు ఉన్నారు. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు సుఖ్విందర్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి సీఎం పీఠం కోసం పోటీపడుతున్నారు. అందుకే హస్తం పార్టీ బీజేపీ నీడను చూసి కూడా భయపడుతోంది. మధ్యప్రదేశ్, కర్నాటకలో తమకు ముప్పు ఉంటుందేమోనన్న కంగారులో ఆ పార్టీ ఉంది. పార్టీ పరిశీలకుడు రాజీవ్ శుక్లా విలేకరులతో మాట్లాడుతూ, “సౌలభ్యం కోసం” ఎమ్మెల్యేలను 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న చండీగఢ్‌కు తరలించవచ్చని, 68 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ మెజారిటీ మార్కు 40 దాటితే… బీజేపీ ప్రయత్నాలు ఫలించవన్నారు. ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. బీజేపీ ఆపరేషన్ కమలం విషయంలో తమకు ఎలాంటి భయం లేదని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ముఖ్యమంత్రి ఎవరన్నది ఎమ్మెల్యేలతో పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. అంతర్గత తగాదాల మధ్య ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై, కాంగ్రెస్‌లో ఉత్కంఠ నెలకొంది.

హిమాచల్‌కు బయలుదేరే ముందు ఛత్తీస్‌గఢ్‌లో ఆ రాష్ట్ర పరిశీలకుడు, సీఎం భూపేష్ బఘేల్ స్పందించారు. హిమాచల్‌కు పార్టీ పరిశీలకుడిగా ఉన్నానన్న ఆయన ఎవరిని ఇక్కడికి తీసుకురామన్నారు. ఐతే బీజేపీని ఓ కంట కనిపెడతామన్న ఆయన… ఎమ్మెల్యేలను సంఘటితంగా ఉండాలని కోరారు. అయితే ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్న రెండు రాష్ట్రాలైన రాజస్థాన్ లేదా ఛత్తీస్‌గఢ్‌కు తీసుకెళ్లవచ్చని ముందుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం ఆ ఆలోచనను పక్కనబెట్టినట్టుగా తెలుస్తోంది. చండీగఢ్‌లో ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చని శుక్లా అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు అక్కడికి సులభంగా చేరుకోవచ్చన్నారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, హర్యానా నాయకుడు భూపిందర్ హుడా – చండీగఢ్ కూడా చేరుకోనున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనేక మంది గెలిచిన అభ్యర్థులు ఇప్పటికే సిమ్లాలోని హోలీ లాడ్జ్‌లోని ప్రతిభా సింగ్ ఇంటి వద్ద సమావేశమయ్యారు. దివంగత భర్త వీరభద్ర సింగ్ కాలం నుండి గత సంవత్సరం ఆయన మరణించే వరకు హోలీ లాడ్జ్ కాంగ్రెస్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. గత అనుభావాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చండీగఢ్‌కు తీసుకువెళుతున్నామన్నారు కాంగ్రెస్ ఇన్చార్జి తజిందర్ సింగ్ బిట్టు. ఎమ్మెల్యేల తలుపులు కిటికీలు మూసివేస్తున్నామన్నారు.