కోహ్లి సెంచరీ కొట్టినా తప్పని ఓటమి
హోల్కర్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మూడో వన్డేలో భారత్‌కు నిరాశే ఎదురైంది. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ కీలక పోరులో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను కివీస్ 2-1తో సొంతం చేసుకుంది. భారత గడ్డపై న్యూజిలాండ్ ఒక వన్డే సిరీస్‌ను గెలవడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (137) అద్భుత సెంచరీతో జట్టుకు వెన్నుముకగా నిలవగా, గ్లెన్ ఫిలిప్స్ (106) మెరుపు శతకంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరి ధాటికి భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది.
338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (11) త్వరగానే వెనుదిరిగాడు. తర్వాత గిల్ (23), శ్రేయస్ అయ్యర్ (3), కె.ఎల్ రాహుల్ (1) వరుసగా పెవిలియన్ చేరడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో విరాట్ కోహ్లి (124) తన క్లాస్ ఇన్నింగ్స్‌తో విరోచిత పోరాటం చేశాడు. 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో కోహ్లి అదరగొట్టినా, అవతలి వైపు నుంచి సరైన సహకారం అందలేదు.
మధ్యలో నితీశ్ కుమార్ రెడ్డి (53) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, చివర్లో హర్షిత్ రాణా (52) మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు ఆశలు కల్పించారు. అయితే కీలక సమయంలో నితీశ్, హర్షిత్ వెనువెంటనే ఔట్ కావడం, ఆ తర్వాత కోహ్లి వికెట్ పడటంతో భారత పరాజయం ఖాయమైంది. భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో ఫౌల్క్స్, క్లార్క్ తలా మూడు వికెట్లతో భారత్ నడ్డి విరిచారు.

