Home Page SliderTelangana

మోకిలాలో రూ.6 కోట్ల విలాసాల విల్లాల దుస్థితి ఇదే..

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ శివార్లలోని మోకిలా విల్లాస్‌ను కూడా  వరదనీరు చుట్టుముట్టింది. అత్యంత విలాసవంతమైన ఈ విల్లాలు నీటమునిగాయి. దాదాపు రూ.6కోట్ల పైచిలుకు ఖరీదు చేసే ఈ విల్లాలు చెరువులో ఉన్నట్లున్నాయి. దీనితో వరద నీటిలో కరెంటు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ సంవత్సరం ఇలాంటి వరదల సమయంలో ఈ కాలనీలు వరద ముంపుకు గురవుతున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. అక్కడి లాపాలొమా విల్లాస్‌లో 212 విల్లాలు నీటమునిగాయి. ఇంతమంది కోటీశ్వరులు నివాసం ఉంటున్న ప్రాంతమైన ఈ ప్రదేశం కూడా చెరువులను ఆక్రమించి కట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రదేశంలో వరదనీటికి పాములు కూడా కొట్టుకువస్తున్నాయని వారు భయపడుతున్నారు. తమకంటే ఎగువ ప్రాంతం నుండి వరదనీరు వస్తోందని పేర్కొన్నారు. తమను పరామర్శించడానికి గానీ, సహాయక చర్యలకు గానీ ఏ అధికారులూ రావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తమ ప్రాంతం నుండి ఖచ్చితంగా ట్యాక్సులు వసూలు చేస్తున్నారని, కానీ ఎలాంటి సహాయక చర్యలు, నివారణ చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. దాదాపు వెయ్యి మందికి పైగా ప్రజలు ఉంటున్నారని వారు పేర్కొన్నారు.