కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా కేసీఆరే సీఎం అవుతారు? తస్మాత్ జాగ్రత్త
ప్రజలకి సేవ చేయడానికి 6 ఫీట్లు, రంగు అక్కర్లే, మనసుంటే చాలు!
కీర్తి రెడ్డి మన ఆడబిడ్డ. కీర్తి రెడ్డికి ఓటు వేస్తే నాకు వేసినట్టే. దుఃఖమెంటో, ఆకలేంటో అనుభవించి వచ్చాను. మాలాంటి వారికి అధికారమిస్తే దానికి పరిష్కారం చూపిస్తానన్నారు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి చందుపట్ల కీర్తిరెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్‌ను ఓడించే సత్తా, శక్తి ఈటల రాజేందర్ కు ఉందని బీజేపీ అక్కడ నాకు టికెట్ ఇచ్చిందన్నారు. నిన్న గజ్వేల్ లో నామినేషన్ వేశాను. గజ్వేల్ జన ప్రభంజనం అయింది. 40 వేలమంది వచ్చారు. అంత జనం వస్తారని నేను కూడా ఊహించలేదు పరేషాన్ అయ్యాను. వారంతా కేసీఆర్ బాధితులు.. నేను కూడా కేసీఆర్ భాదితుడ్నే.. వారికి నేను నాయకత్వం వహిస్తున్నానన్నారు ఈటల. కీర్తిరెడ్డినే కాదు పక్కనే ఉన్న నన్ను కూడా ఆశీర్వదించాలని మీదగ్గరకి వచ్చానన్నారు. అరగంట పాటు మాట్లాడిన కీర్తిరెడ్డి మాటల్లో ఆవేదన ఉంది. ప్రజలు నమ్మితే ఆశీర్వదిస్తారనడానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు ఈటల. ప్రజలకి సేవ చేయడానికి 6 ఫీట్లు, రంగు అక్కర్లే, మనసుంటే చాలునన్నారు.

మోదీ మాటంటే మాట.. తెలంగాణకు బీసీ సీఎం పక్కా
ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఒక హామీ ఇచ్చారు. బీసీనీ ముఖ్యమంత్రి చేస్తాం అని ప్రకటించారు. దుఃఖం, ఆకలి తెలిసినవాన్ని అని చెప్పారు. ఈ రోజు గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి మోదీ ఇచ్చిన డబ్బులతోనే కానీ అది కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారు. లక్షా 20 వేల కోట్ల అప్పు తెచ్చి కాళేశ్వరం కట్టారు. మూడేళ్లలో కుంగిపోయింది. ఢిల్లీ నిపుణులు రిపేర్ చేయడం కూడా కష్టమే అని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలకు మళ్లీ కరువే మిగిలింది. బీజేపీ వస్తే పుస్తెల తాళ్ళు డాక్టర్ల కాళ్ళమీద పెట్టి భర్తకు వైద్యం చేయమని అడిగే దుస్థితి లేకుండా ఉచిత వైద్యం అందిస్తాం. పేదలకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తాం. వరదారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డిలకు యునివర్సిటీలు ఇచ్చారు. వాటిల్లో రిజర్వేషన్లు లేవు. పేదలు చదువుకునే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఖతం పట్టించి పేదలకు ఉన్నత విద్యను దూరం చేసిన దుర్మార్గుడు కేసీఆర్. బీజేపీ వస్తే ఉస్మానియా నుండి అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రైవేట్ కంటే మంచి విద్య అందిస్తామన్నారు ఈటల.

బీజేపీ అధికారంలోకి వస్తేనే సంక్షేమం
ఒకప్పుడు సింగరేణిలో మట్టి తీసే పని మాత్రమే కాంట్రాక్టుకు ఇచ్చేవారు ఇప్పుడు బొగ్గు, మట్టి అన్నీ ప్రైవేటుపరం చేశారన్నారు ఈటల రాజేందర్. తెలంగాణ వచ్చినప్పుడు 63 వేల మంది కార్మికులు ఉంటే ప్రైవేట్ కాంటాక్ట్లకి ఇచ్చి ఉద్యోగాలు 40 వేలకు పడిపోయేలా చేశాడు కేసీఆర్ అని మండిపడ్డారు. బీజేపీ వస్తే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ పరంగానే సింగరేణి వ్యవస్థను నడుపుతామన్నారు. తాడిచెర్ల ప్రైవేట్ కి వద్దని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము కొట్లాడితే భయపడి ఇవ్వలేదు.. కానీ కేసీఆర్ వచ్చాక బరితెగించి ఆ కంపెనీని ఏఎంఆర్ అనే ప్రైవేట్ సంస్థకు ఇచ్చారన్నారు ఈటల. బీజేపీ రాగానే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామన్నారు. ఒక్క ఓటు వేయండి ముసలి వాళ్ళిద్దరికీ పెన్షన్ అందిస్తామన్నారు. మహిళల రుణాల కింద నాలుగువేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను కేసీఆర్ ఎగ్గొట్టాడు. వాటిని కట్టే బాధ్యత మాది. మహిళలకు ఇన్సూరెన్స్ స్కీముల డబ్బులన్నీ ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. పేద కుటుంబంలో ఎవరు చనిపోయిన ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీం అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో పేదలకు అందుతున్న రేషన్ బియ్యం ప్రతిగింజ మోడీ ఇస్తోందేనన్నారు. కానీ కేసీఆర్ సొమ్మొకడిది సోకు ఒకరిదిలా వ్యవహరిస్తున్నారు.

కాంగ్రెస్ పాలనలో బీసీలకు ఒరిగిదేముంది?
బీజేపీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ప్రధానమంత్రి ప్రకటించారని… 75 సంవత్సరాలుగా మాకు రాజ్యాధికారం కావాలని బీసీలు కోరుతున్నారన్నారు ఈటల రాజేందర్. 50 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిని చేయలేదు. నీలం సంజీవరెడ్డి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఏనాడు ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేరు. బీఆర్ఎస్ పార్టీలు ఉన్నంతకాలం ఆ కుటుంబం వారే ముఖ్యమంత్రులుగా ఉంటారు. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డికి ఓటు వేస్తే కేసీఆర్‌కి ఓటు వేసినట్టే. మీ భూములు గుంజుకున్న, మీకు పెన్షన్లు ఇవ్వకుండా, వడ్డీ లేని రుణాలకు పైసలు ఇవ్వకుండా.. రైతు రుణమాఫీ చేయకుండా, బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా… చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేకుండా.. మోసం చేసే ముఖ్యమంత్రికి ఓటు వేద్దామా? అని ప్రశ్నించారు. అందుకే ఈసారి టీఆర్ఎస్‌కి ఓటేయవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా కూడా ముఖ్యమంత్రి కేసీఆరే అవుతారు. 2014లో ఎమ్మెల్సీలు ఎంత కట్టగట్టుకుని కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. 2018లో 19 మందిని గెలిపిస్తే 12 మంది మా పార్టీని బీఆర్ఎస్‌లో కలిపేస్తున్నామని కలిపేసి కేసీఆర్ పంచన చేరారన్నారు. పుసుక్కున వారు గెలిస్తే కేసీఆర్ దగ్గరికి పోతారని అందుకే బీజేపీకి ఓటేయాలన్నారు. ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక తల్లిదండ్రుల దుఃఖం ఇంకా మర్చిపోలేదు.. బయ్యారం శంకర్ రాసిన లేక ఇంకా కళ్ల ముందే మెదులుతోందన్నారు ఈటల రాజేందర్.