Home Page SliderTelangana

పార్టీలు వేరైనా.. పల్లవి ఒక్కటే!

నడువు నడువు నడవవే రామక్క.. కలిసి నడుము కట్టవే రామక్క అంటూ హోరెత్తుతున్న పాటను గులాబీ దళం రూపొందించింది. విశేషమేమిటంటే.. అదే పల్లవి, అదే ట్యూన్‌తో హస్తం పార్టీ, కమలం జట్టు కూడా పాటకు ప్రాణం పోశాయి. నామినేషన్ల లొల్లి షురూ కానున్న నేపథ్యంలో మైకులు కూడా పాటల మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఎవరి డప్పుకు వారు దరువేస్తున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. ఎన్నికల సీజన్ కావడంతో అలా ఏదో ఓ పాట వినిపించగానే ఇలా తమ పార్టీదే ఆ పాట అన్న ధీమాతో సెల్‌ఫోన్లలో సౌండ్ పెంచుతున్నారు. ఒక్కోసారి పాట మిస్‌ఫైర్ అవుతోంది. పల్లవి దాటగానే తమ పార్టీపైనే తిట్ల రాగం వినిపిస్తోంది. దీంతో సదరు ఫ్యాన్స్ సౌండ్ తగ్గించి ఈ విషాదగీతమేందిరా బై అంటూ ముఖం చిట్లిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో చాలా పాటలు సేమ్ టూ సేమ్ ఉంటున్నాయి. పాట సగం వరకు వింటే గానీ ఏ పార్టీదో తేల్చుకోలేక పోతున్నారు. కొందరు గాయకులు తమ గాత్రాన్ని అన్ని పార్టీలకూ సమానంగా పంచుతున్నారు. ఇలాంటి పాటల హోరులో.. దినసరి కార్యకర్తలు ఓ రోజు ఆ గట్టున స్టెప్పులేస్తుంటే… ఇంకో రోజు ఈ గట్టున కోరస్ కలుపుతున్నారు. మొత్తంగా తమ పాటలు అరిగిపోయిన రికార్డులైనా సరే గానీ ఓటర్ల మనసు మాత్రం కరిగించు మహాప్రభో అంటూ రాజకీయ నాయకులు, పార్టీలు మనసులోనే గీతాలాపన చేస్తున్నాయి.