ఎన్నికల్లో ఓడినా ..బీఆర్ ఎస్ కి బుద్ది రాలేదు
కేసిఆర్పదేళ్లలో చేయలేని పనులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే చేసి చూపామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వేములవాడలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. పట్టుమని పది నెలలు కాకముందే పీఠం నుంచి దిగిపొమ్మంటున్నారని కేసిఆర్ పై మండిపడ్డారు. నిజాలను ఎదుర్కొనే దమ్ముంటే కేసిఆర్ అసెంబ్లీకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. రైతురుణ మాఫీపై తమ దగ్గర అన్నీ లెక్కలు ఆధారాలతో సహా ఉన్నాయని చెప్పారు.ఉద్యోగాలు ఇవ్వలేదని కల్వకుంట్ల కుటుంబీకులు అబద్దాలు చెబుతున్నారని….ఇచ్చిన మాట ప్రకారం అందరికీ ఉద్యోగాలిచ్చామని, ఒక్క ఉద్యోగం తక్కువ ఇచ్చినట్లు రుజు చేసినా ఎల్.బి.స్టేడియంలో క్షమాపణల చెబుతా అని రేవంత్ స్పష్టం చేశారు. కేసిఆర్ ఫాం హౌస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని, కేటిఆర్, హరీష్ రావు ఇద్దరూ తెలంగాణ అభివృద్దికి విఘాతంగా పరిణమించారని ఆరోపించారు.అభివృద్దికి సహకరిస్తే తెలంగాణ సమాజం హర్షిస్తుందని, లేకుంటే ఛీత్కరించుకుంటుందని రేవంత్ హెచ్చరించారు.