బీజేపీ యువ మోర్చ నిరుద్యోగ మహా ధర్నాలో పాల్గొన్న ఈటల రాజేందర్
నిరుద్యోగ సమస్యలపై బీజేపీ యువమోర్చ ఇందిరాపార్కు వద్ద నిరసనలు చేపట్టింది. ఈధర్నాలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. నిరుద్యోగుల తరపున తన గొంతు విప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “గ్రూప్ 2లో పోస్టులను 783 నుండి రెండువేలకు పెంచాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన ఏ మాటనూ నిలబెట్టుకోలేదు. ఎన్నికలు వచ్చిన సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చి ఓట్లడుగుతారని, ఇతర సమయాలలో కనిపించరు. 1 :100 ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలి, ఉద్యోగాలు వస్తేనే ఇంటికి పోతాం, పెళ్లి చేసుకుంటాం అని నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నారు. ప్రతీ నిత్యం ప్రభుత్వం ఏం చేస్తోందో ప్రజలు గమనిస్తున్నారు. నిరసనలు చేసే నిరుద్యోగులపై కేసులు పెట్టి, వారిని జైళ్లపాలు చేశారు. ఈ సమయంలో అధికారం ఉందని, పోలీసులను నమ్ముకుని యువతను దూరం చేసుకుంటే అధోగతి పాలవుతారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. చిన్న చిన్న ఉద్యోగులు పైసా పైసా కూడబెట్టి స్థలాలు కొనుక్కుని ఇళ్లు కట్టుకుంటే 35 సంవత్సరాల తర్వాత వారి ఇళ్లు కూల్చివేయడం దారుణం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు వారి ఇళ్లను అధికారమదంతో కూల్చివేస్తున్నాడు. ప్రజలకు మేలు చేసే పనులు చేస్తేనే ప్రజలు హర్షిస్తారు. అంతేకానీ పార్టీ పెద్దల మెప్పు కోసం పని చేస్తే ప్రజలు పాతరేస్తారు. భారతీయ యువ మోర్చా నిరుద్యోగులకు ఎప్పుడూ అండగా ఉంటుంది. నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించాలి. గ్రూప్ 1,2,3, 4 పోస్టులను పెంచాలి. ఒక పోస్టుకు కేవలం 100 మంది మాత్రమే పోటీ పడేలా పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తున్నాం”.

