Home Page SliderTelangana

ధర్నాచౌక్‌లో ఈటల రాజేందర్

వెస్ట్ బెంగాల్‌లో జరిగిన అమానుష ఘటనపై దేశవ్యాప్త బంద్‌ పాటిస్తున్న డాక్టర్ల ధర్నాకు మద్దతు తెలిపారు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌లో బంద్ చేస్తున్న డాక్టర్ల బృందాన్ని కలిసి వారికి మద్దతుగా ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “బెంగాల్ రాష్ట్రంలో జరిగిన అమానుషదాడిని ఖండిస్తున్నాను. ఇలాంటి సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి ఇంకెప్పుడూ కలుగకూడదని దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నందుకు నా మద్దతు ఉంటుంది. గతంలో పాలకులు ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు కాకపోవడం వల్ల, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రజలకు ప్రాణదానం చేసే డాక్టర్లు ఇలా రోడ్ల మీదకు రావడం చాలా దురదృష్టం. చిన్ననాటి నుండి ఎంతో కష్టపడి డాక్టర్ చదువు చదివిన వాళ్లు ఇలా రక్షణ కరువు కావడం ఎంతో బాధ కలిగిస్తోంది. ఒక డాక్టర్‌గా పేరు రావాలంటే ఎంతో కష్టం. ఐదేళ్ల ఎంబీబీఎస్ మాత్రమే కాక, మళ్లీ ఎండీ చదివితేనే డాక్టర్‌కు మంచి గుర్తింపు వస్తుంది. గవర్నమెంట్ ఆసుపత్రులలో సరైన సౌకర్యాలు లేకున్నా, వైద్యులు ఎంతో బాధ్యతతో తక్కువ జీతాలకే పనిచేస్తున్నారు. ఇలాంటి కామాంధులకు చాలా కఠినమైన శిక్షలు వేయాలని కోరుతున్నాను. ఇలాంటి సైకో శాడిస్టులకు, మానవ మృగాలకు సమాజమే సరైన శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాటికి కఠిన చట్టాలు తీసుకురావడం ఎంతో అత్యవసరం. నాగరికులమని చెప్పుకుంటూ ఇంకా ఆటవిక సంస్కృతి వైపు మళ్లుతున్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా, మేధోమధనం జరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సైకోలను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాను. డాక్టర్లకు పూర్తి రక్షణ కలిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వీరికి సంఘీభావం తెలియజేస్తున్నాను.” అని పేర్కొన్నారు.