ఈటల మల్లయ్య అంత్యక్రియలు పూర్తి
హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య బుధవారం పూర్తయ్యాయి. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఆర్వీఎం ఆస్పత్రిలో మృతి చెందిన మల్లయ్యను కడసారి చూసేందుకు బీజేపీ కార్యకర్తలు, ఈటల అభిమానులు హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు భారీ ఎత్తున తరలివచ్చారు. మల్లయ్య (104) దశ దిన కర్మ పూర్తయ్యే వరకు ఈటల రాజేందర్ తన స్వగ్రామంలోనే ఉంటారు. ఆ తర్వాతే ఆయన రాజకీయాలపై దృష్టి పెడతారని ఈటల సన్నిహితులు తెలిపారు.

బొడిగ శోభ, గాలన్న, దాసోజు శ్రవణ్, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఏనుగు రాకేశ్‌రెడ్డి, గంగాడి కృష్ణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి నరహరి, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రావు పద్మ తదితర నాయకులు కమలాపూర్‌కు వచ్చి ఈటల రాజేందర్‌ను పరామర్శించారు. మల్లయ్య మృతదేహానికి పూలమాల వేసి.. ఆయన అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీ హన్స్‌రాజ్, పితాని సత్యనారాయణ, డీకే అరుణ, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఇంద్రసేనా రెడ్డి, జూపల్లి, ఏ చంద్రశేఖర్, పలువురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఈటలను ఫోన్‌లో పరామర్శించారు.

