బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల
బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్‌ను నియమిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ముఖ్యభూమిక పోషించారు ఈటల రాజేందర్. అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి నుండి ఏకంగా మూడున్నర లక్షల పై చిలుకు ఓట్లతో మెజారిటీ సాధించారు. తనను మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుండి నియోజక వర్గ వ్యాప్తంగా నిర్విరామంగా పర్యటనలు కొనసాగించారు. 80 రోజుల పాటు సభలు, సమావేశాలు నిర్వహించారు. కాలనీల వారీగా ప్రజలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని మరోమారు కేంద్ర మంత్రిగా ప్రకటించారు. గతంలో బీజేపీ అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్‌కు కూడా మంత్రివర్గంలో స్థానం దక్కింది. దీనితో పార్టీలో బలమైన నాయకుడిగా ఉన్న ఈటల రాజేందర్‌ను బీజేపీ కొత్త అధ్యక్షునిగా నియమించవచ్చని తెలుస్తోంది. నేడు కేంద్రమంత్రి అమిత్‌షాతో ఈటల రాజేందర్ భేటీ అవుతారని, ఈ సమావేశంలో ఈ విషయంపై స్పష్టత రావచ్చని సమాచారం.