బిల్ గేట్స్ కు షాకిచ్చిన ఎప్‌స్టీన్
ప్రపంచ అపరకుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేరు మరోసారి వివాదాల నడుమ నిలిచింది. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉండి జైల్లో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన దర్యాప్తు పత్రాలను అమెరికా న్యాయశాఖ తాజాగా బహిర్గతం చేయడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ పత్రాల్లో బిల్ గేట్స్‌పై చేసిన కొన్ని ఆరోపణలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ శుక్రవారం నాడు దాదాపు 30 లక్షల పేజీల పత్రాలు, 2,000 వీడియోలు, 1.80 లక్షల చిత్రాలను విడుదల చేశారు. ఎప్‌స్టీన్ కేసులో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ఈ ఫైల్స్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ పత్రాల్లో ముఖ్యంగా ఎప్‌స్టీన్ రాసిన కొన్ని ఈమెయిల్ డ్రాఫ్ట్‌లు తీవ్ర చర్చకు దారి తీశాయి.
ఎప్‌స్టీన్ తన ఈమెయిల్స్‌లో బిల్ గేట్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రష్యన్ మహిళలతో గేట్స్‌కు ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగా ఆయనకు లైంగిక వ్యాధి సోకిందని, ఆ విషయాన్ని తన భార్య మెలిండా గేట్స్ నుంచి దాచేందుకు ప్రయత్నించారని ఎప్‌స్టీన్ పేర్కొన్నట్లు ఆ డ్రాఫ్ట్‌లలో ఉంది. ఆ వ్యాధి మెలిండాకు తెలియకుండా ఉండేందుకు, లేదా ఆమెకు చికిత్స అందించేందుకు ఆమెకు తెలియకుండానే మందులు ఇవ్వాలన్న ఆలోచనపై గేట్స్ తనతో చర్చించినట్లు ఎప్‌స్టీన్ ఆరోపించాడు. అలాగే, కొన్ని సందర్భాల్లో మందుల సరఫరాకు సహాయం చేయాలని కూడా గేట్స్ తనను కోరినట్లు ఆ ఈమెయిల్స్‌లో పేర్కొన్నాడు.
ఈ పత్రాలన్నింటిని పరిశీలిస్తే, ఎప్‌స్టీన్ బిల్ గేట్స్‌ను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2017లో ఒక రష్యన్ బ్రిడ్జ్ ప్లేయర్‌తో గేట్స్‌కు ఉన్న సంబంధాన్ని బహిర్గతం చేస్తానని ఎప్‌స్టీన్ బెదిరించినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. గేట్స్ తన ఛారిటీ కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టలేదన్న అసంతృప్తితోనే ఎప్‌స్టీన్ ఈ రీతిలో వ్యవహరించినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి.

