రైతు ముఖంలో ఉత్సాహం
మెతుకు సీమగా పెరుగాంచిన మెదక్ జిల్లాలో అత్యధికులకు వ్యవసాయమే జీవనాధారం. జిల్లాలో ఘనపూర్, హల్దీ ప్రాజెక్టుల కింద, 2681 చెరువుల కింద వివిధ పంటలు పండిస్తున్నారు. వరి ప్రధాన పంట కాగా, పత్తి, మొక్కజొన్న, కందులు, కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. పంట సాగు పెట్టుబడికి అత్యధిక మంది రైతులు బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. తక్కువ వడ్డీకే రుణ సదుపాయం ఉండటంతో ఎంతోమంది వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. వాయిదాల రూపంలో బ్యాంకులకు రుణాలు చెల్లిస్తుంటారు. రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామంటూ ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీ అమలును ఆమోదించడం ఆనందదాయకం.

