‘రాష్ట్ర పునర్నిర్మాణంలో ఇంజనీర్లదే కీలక పాత్ర’ – మంత్రి
పదేండ్లు విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణంలో..ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకం. కొందరు పాలకులు, అతికొద్దిమంది ఇంజనీర్ల స్వార్ధం యావత్ ఇంజనీర్లందరికి మాయని మచ్చగా మారింది. అంటూ వ్యాఖ్యానించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గురువారం హైటెక్స్ ప్రాంగణంలోని న్యాక్ (నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్) లో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 156 మంది ఆర్ అండ్ బీ శాఖ ఇంజనీర్లకు శాఖపరమైన అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న 5 రోజుల ఒరియెంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రారంభించిన మంత్రి నూతన ఇంజనీర్లకు మార్గనిర్ధేశనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

“మీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యనో, నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ వంటి ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోవాలి కానీ కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను కాదని మీ అందరిని కోరుకుంటున్నా. రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులు కట్టిన వెంటనే కూలిపోయి ఇంజనీర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన సంఘటనలను మనం చూసాం.. దయచేసి అలాంటి ఇంజనీర్లను కనీసం కలలోకి కూడా రానివ్వకండని నేను సలహా ఇస్తున్నా. విశ్వేశ్వరయ్య వంటి ఇంజనీర్లు రూపొందించిన ప్రణాళికలు ఇవ్వాల్టీకి కూడా మనల్ని రక్షిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీ కొత్త ఇంజనీర్ల పట్ల అత్యంత ఆశాభావంతో ఉంది. మీరంతా మీకు అప్పగించిన పనిని నిబద్ధతతో చేస్తే మన రాష్ట్రం ప్రగతిబాటన సాగుతుంది. మీరు నిర్మించేంది కేవలం రోడ్డో, బ్రిడ్జినో, భవనమో కాదు.. అది లక్షల మంది అవసరాలు తీర్చే ఒక కట్టడం అన్న సంగతిని గుర్తెరగాలని కోరుకుంటున్న. అప్పుడు మాత్రమే మీరు నాణ్యమైన నిర్మాణాలను చేపడతారని నేను విశ్వసిస్తున్నాను. మీరు చేయిస్తున్న ప్రతీ పని మాదో, మీదో కాదు.. రాష్ట్ర ప్రజల సంపదను బాధ్యతగా వారి కోసం వినియోగించే ఒక యగ్ఞంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. మీరు, మేం అంతా ఒక కుటుంబంలా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిద్దాం. రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం.. పదేండ్లు విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిస్తాం”. అని పేర్కొన్నారు.

