‘ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్ పెడ్లర్లుగా మారుతున్నారు’..రేవంత్ రెడ్డి
మాసబ్ ట్యాంకులోని బీఎస్‌ఎఫ్‌ఐ స్కిల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం, అమ్మకం, కొనుగోలు ఎవరు చేసినా తప్పేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. చదువుకునే విద్యార్థులు డ్రగ్స్ వినియోగం బారిన పడకుండా కాపాడుకోవాలన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ కొనుగోలు చేయడమే కాకుండా, అమ్మకాలు జరిపి డ్రగ్ పెడ్లర్లుగా మారుతున్నారని వాపోయారు. గంజాయి వినియోగం విద్యార్థులు, నిరుద్యోగులలో ఎక్కువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నిరుద్యోగాన్ని పారద్రోలడానికి స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి హైదరాబాద్‌కు వచ్చిన విద్యార్థులు ఉద్యోగాలు లేక పక్కదార్లు పడుతున్నారు. అందుకే పాలిటెక్నిక్ విద్యాసంస్థలను అప్‌గ్రేడ్ చేస్తున్నాం. హైదరాబాద్‌లో ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి. అందుకే మల్టినేషనల్ కంపెనీలు హైదరాబాద్ విద్యార్థులను ఉద్యోగాలలో తీసుకుంటున్నారు. దేశంలోని అత్యున్నత విద్యావ్యవస్థ, ఐటీ రంగం అభివృద్ధి జరుగుతోందన్నారు. అమెరికా సిలికాన్ వ్యాలీలో తిరుగుతూంటే, మన అమీర్ పేట చౌరస్తాలో ఉన్నట్లే ఉంటుంది. అందరూ తెలుగు మాట్లాడుతూనే ఉంటారు. ప్రపంచంలోని మంచి యూనివర్సిటీలను హైదరాబాద్‌కు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రపంచంతో పోటీ పడగలగే సామర్థ్యం ఉన్న యువత మనదగ్గర ఉన్నారు. వాళ్లను సరిగ్గా ఉపయోగించుకోవడమే మన పని. మన భారత్‌లో కుంటుపడింది సాంకేతిక నైపుణ్యమే. ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఇవ్వగలిగే మహా నగరం హైదరాబాద్. విశ్వనగరంగా ప్రపంచంలోని నలుమూలల నుండి సాంకేతికను ఇక్కడ నేర్పించేటందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించాము. దీనికి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్రను ఛైర్మన్‌గా నియమించాం. తెలంగాణ యువత ఈ యూనివర్సిటీని ఉపయోగించుకుని అన్నిరకాలుగా అభివృద్ధి సాధించాలని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.