కేరళ కంటే ఉపాధి వేతనాలు ఇక్కడ తక్కువ
ఏలూరు వన్‌టౌన్: పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని సీపీఎం రాజ్యసభ సభ్యుడు, భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకుడు వి.శివదాసన్ విమర్శించారు. ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బుధవారం ఏలూరులోని కాశీవిశ్వేశ్వర కళ్యాణ మండపంలో సీపీఎం ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్ట పరిరక్షణ, పనిదినాలు, వేతనాల పెంపుపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఉపాధి హామీ సమస్యలపై సదస్సులో తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా శివదాసన్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒకే దేశం – ఒకే చట్టం, ఒకే రేషన్ చట్టం, ఒకే ఆధార్‌కార్డు అంటూ నినాదాలు ఇస్తోందని.. ఒకే దేశం – ఉపాధి కార్మికులందరికీ ఒకే వేతనమని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కేరళ కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీలో కూలీలకు తక్కువ వేతనాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులందరికీ ఉపాధి కల్పించి కనీస వేతనాలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మాట్లాడుతూ శాసన మండలిలో ఉపాధి హామీ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు వి.వెంకటేశ్వర్లు, మంతెన సీతారాం తదితరులు పాల్గొన్నారు.

